హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్ దేశాలతో సహా ఇతర రీజియన్లలో కొనసాగుతున్న యుద్ధాలతో మానవాళి మనుగడకు పెను ముప్పు పొంచి ఉన్నదని సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హాల్లో నిర్వహించిన 13వ ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ (ఐడీపీడీ) జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.
ఆరోగ్య సంరక్షణను పెంపొందించేందుకు ఈ సమావేశాలు రూపొందించినట్టు వెల్లడించారు. ఈ సదస్సులో ఆరోగ్య సంరక్షణలో ఉన్న సవాళ్లు, ఆరోగ్యపరంగా మనకు ఉన్న హక్కులు కాపాడటంలో వైద్యులు, విద్యార్థులు పౌరసమాజం పాత్రపై విస్తృతంగా చర్చిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ చాన్స్‌లర్ డాక్టర్ కే శ్రీనాథ్‌రెడ్డి, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ అమర్జీత్ కౌర్, ఐడీపీడీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షకీల్ ఉర్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.