బొంరాస్పేట, ఆగస్టు 10: రైతులు, పేదల అనుమతి లేకుండా ఫార్మా కంపెనీల కోసం సాగు భూములను బలవంతంగా సేకరించడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్పల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం దుద్యాల మండలం హకీంపేటలో రైతులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీల కోసం హకీంపేట గ్రామంలో 505 ఎకరాలు, పోలేపల్లిలో 130 ఎకరాలు, లగచెర్ల, పులిచెర్లకుంట తండా, రోటిబండ తండాలో 643 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు.
కొడంగల్ నియోజకవర్గంలో 1,154 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి అన్యాక్రాంతమైందని, అధికారులు ఆ భూముల జోలికిపోకుండా పేదలు, సన్న, చిన్నకారు రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని ఆరోపించారు. ధరణి, ప్రభుత్వ, అసైన్డ్ భూముల సమస్యలను పరిష్కరించాలని కొడంగల్ పట్టణంలోని రెడ్డిబసిరెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 13న జిల్లా స్థాయి భూసదస్సు నిర్వహిస్తామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు హకీంపేటలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమ ంలో రైతులు మల్లేశం, నర్సింహులు, బసప్ప, నారాయణ, వెంకటయ్య, మణికంఠగౌడ్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.