హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : అధికారుల విధుల కోసం అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుతుపున్న డ్రైవర్లు, యజమానులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్‌లో వివిధ విభాగాలకు వాహనాలు తిప్పుతున్న డ్రైవర్లు తమకు రావాల్సిన 8 నెలల బిల్లుల కోసం ఆందోళన చేపట్టారు. కార్యాలయం ఎంట్రెన్స్ దగ్గర బైఠాయించి పెద్దఎత్తున నినదించారు. రాష్ట్రవాప్తంగా అద్దె వాహనాలు తిప్పుతున్న వారికి చెల్లించాల్సిన నిధులు రూ.కోట్లలో పెండింగ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేశారు. హైదరాబాద్ సహా, అన్ని ప్రాంతాల్లో సుమారు 20 నెలల నుంచి బిల్లులు పెండింగ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సుమారు 500 వాహనాలను నిలిపివేసి ఆందోళనలో పాల్గొన్నట్టు చెప్పారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన రూ.240 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు.
డ్రైవర్ల ఆందోళన తీవ్రతరంతో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రఘునందన్‌రావు వారిని చర్చలకు ఆహ్వానించారు. దీంతో డ్రైవర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఐదుగురు చర్చలకు హాజరై తమ సమస్యలను కమిషనర్‌కు ఏకరువు పెట్టారు. కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్‌లో వాహనాలు నడుతున్న డ్రైవర్లకు నెలల తరబడి బిల్లలు క్లియర్ చేయలేదని చెప్పారు. ఒక్కోసారి డీజిల్‌కు డబ్బులు లేక, పిల్లల ఫీజులు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నామని చెప్పారు. స్పందించిన రఘునందన్‌రావు బిల్లుల ఫైల్స్ గురించి ఆరా తీయగా అధికారులు ఒకరిపై మరొకరు చెప్పుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే బిల్లులు వచ్చేలా చూస్తానని చెప్పారు. ఇదే విషయం ధర్నా చేసే వారితోనూ చెప్పాలని కోరడంతో, కమిషనర్ ఒప్పుకోకపోవడంతో తమ నిరసన కొనసాగుతుందని ప్రకటించారు.
సచివాలయంలో అద్దె ప్రాతిపదికన తిరిగే వాహనాలు సుమారు 50 వరకు ఉండటం, వారికి కూడా 8 నెలలుగా బిల్లులు రాకపోవడంతో వారు సైతం ఆందోళనబాట పట్టారు. దీంతో డ్రైవర్ల దగ్గర పరువుపోతోందని గ్రహించిన ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. నవంబర్ మొదటివారంలో డబ్బులు విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4వేల వాహనాలు తిరుగుతుంటే, కేవలం సచివాలయ వాహనాల బకాయిలు మాత్రమే విడుదల చేయడంపై జిల్లాల్లో పనిచేస్తున్న డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ అద్దెవాహనాల డ్రైవర్ల సమస్యలను వెలుగులోకి తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’కు డ్రైవర్లు, యజమానులు కృతజ్ఞతలు తెలిపారు.