వరంగల్ : వరంగల్ నగరం గొప్ప విద్యా, వైద్య కేంద్రంగా మారాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇవాళ భూమి పూజ చేసిన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏడాదిన్నర లోపు పూర్తి కావాలి. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీరియస్‌గా పని చేయాలన్నారు.
వరంగల్ కచ్చితంగా పరిశ్రమల కేంద్రం కావాలి. గొప్ప విద్యాకేంద్రం, వైద్య కేంద్రం కావాలి. తూర్పు తెలంగాణకు ఇది ఒక హెడ్ క్వార్టర్ కావాలి. ప్రపంచంలో అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు కెనడాలో ఉన్నాయని తెలిసింది. వైద్యశాఖ అధికారులతో కలిసి కెనడాను విజిట్ చేసి.. వీడియోలు, ఫోటోలు చిత్రీకరించండి. కెనడాను తలదన్నేలా ఆస్పత్రి నిర్మాణం ఉండాలి. అన్ని వైద్య సేవలు ఒకే ప్రాంగణంలో రావాలి. మహిళలు ప్రసవిస్తేనే మనందరం పుట్టాం. మాతాశిశు సంరక్షణ చాలా ప్రాధాన్యమైన అంశం. తెలంగాణ మొత్తం నాగరికంగా మారాలి. ప్రతి పాత తాలుకా సెంటర్లో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు రావాలి. ఒక మినీ నిలోఫర్ సెంటర్ రావాలి. వరంగల్‌కు డెంటల్ కాలేజీ, డెంటల్ హాస్పిటల్ మంజూరు చేస్తున్నాం. హైదరాబాద్ వాళ్లు కూడా ఇక్కడికే వచ్చేలా విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలి. త్వరలోనే మామునూర్ ఎయిర్‌పోర్టు రాబోతుంది. వరంగల్‌లో మంచినీళ్ల గోస లేదు. వరంగల్‌లో పెట్టుబడులు రావాలి. ఐటీ కంపెనీలను విస్తరించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.