ముంబై: శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఓటరు జాబితాల ప్రత్యేక విస్తృత పునఃసమీక్ష (సర్) ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. (Uddhav, Raj Thackeray) ఆదివారం ‘విరాట్ గర్జన మోర్చా’ పేరుతో దక్షిణ ముంబైలోని మెట్రో సినిమా వద్ద ప్రారంభమైన భారీ నిరసన ర్యాలీ, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ముగిసింది. ఆ తర్వాత అక్కడ జరిగిన బహిరంగ సభలో ఠాక్రే సోదరులు ప్రసంగించారు.
కాగా, 2024 లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల మధ్య ఉన్న ఆరు నెలల వ్యవధిలో మహారాష్ట్రలో మొత్తం ఓటర్ల సంఖ్య 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ఎలా పెరిగిందని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లకు బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ నిర్వహించాలని ఆయన కోరారు. ‘ఈ రెండు చర్యలు చేపడితే వాస్తవ పరిస్థితి స్పష్టమవుతుంది’ అని అన్నారు.
మరోవైపు ఒక నియంతను కూలదోయడానికే ఈ నిరసన చేపట్టినట్లు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ‘సర్’ ప్రక్రియలో భాగంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. తమ ఓటు హక్కు కోసం ప్రజలు సుప్రీంకోర్టును ఆశ్రయించారని చెప్పారు. దేశమంతా ఇప్పుడు ‘ఓటు దొంగలకు’ వ్యతిరేకంగా నిలుస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో ‘సర్’ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ‘పక్షపాత ధోరణిలో’ నియమించారని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి పరిపాలనకు మధ్య పొంతన లేదని ఆరోపించారు. ‘బీజేపీ పరిపాలనను నడపలేదు. వారు ప్రభుత్వాన్ని నడిపే విధానం పరిపాలన కాదు, అది ప్రతీకారం’ అని అన్నారు.