M Venkaiah Naidu : ఫిలింనగర్ సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల(కర్నూలు) క్రమశిక్షణ, నైతికతకు నిలయమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అభివర్ణించారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని కల్చరల్ సెంటర్(FNCC)లో ఆదివారం జరిగిన సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల ఫ్రాటెర్నిటీ-2026 వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఈ కళాశాల ఎందరో మేధావులను దేశానికి అందించడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
ఫిలింనగర్‌లోని కల్చరల్ సెంటర్లో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ(కర్నూలు) ఫ్రాటర్నిటీ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. 1972 మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థులతో పాటు 2026-27 విద్యా సంవత్సరం చదువుకున్నవారు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘ఓర్పు, దీక్ష, నిరంతర కృషి లేకుండా ఏ రంగంలోనూ శాశ్వత విజయం సాధ్యం కాదు. డిగ్రీ అయిపోగానే కేవలం ఉద్యోగం కోసం ఎదురుచూసే “ఉద్యోగార్థులుగా” కాకుండా, పది మందికి ఉపాధి కల్పించే “ఉద్యోగ కల్పనదారులుగా” యువత మారాలి. బోధన కేవలం తరగతి గది నాలుగు గోడలకే పరిమితం కాకూడదు.

పరిశ్రమల అవసరాలకు, కళాశాలల సిలబస్‌కు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాలి. ఉపాధ్యాయులు కేవలం పాఠం చెప్పి వెళ్లే బోధకులుగా కాకుండా, విద్యార్థులకు మంచి మార్గదర్శకులుగా నిలవాలి. సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తించాలి. కేవలం సంపాదన ఒక్కటే జీవితం కాదు; మనం నివసించే సమాజానికి, దేశానికి మనం ఏమి తిరిగి ఇస్తున్నాము అనే స్పృహ ప్రతి యువకుడిలోనూ కలగాలి’ అని భారీగా తరలివచ్చిన సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థులకు వెంకయ్య సూచించారు. అనంతరం పలు కోర్సుల్లో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఆయన గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేశారు.
ఆద్యంతం కోలాహలంగా, పలకరింపుల పరిమళంలా సాగిన ఈ వార్షికోత్సవంలో విద్యార్థినుల సంప్రదాయ నృత్యప్రదర్శన ఆకట్టుకోగా.. కాలేజీ తొలితరం వాళ్లు డీజే పాటలకు వేదికపై హుషారుగా డాన్సులు చేశారు. అంతేనా.. మూడేళ్లు ఒక్కచోట చదివి.. ఆపై పలు రంగాల్లో రాణిస్తున్న, ఉన్నతోగ్యాలు సాధించిన పలువురు ఈ వార్షికోత్సవంలో తమ జూబ్లీ స్నేహితులను, రూమ్మేట్స్ను కలిసి మురిసిపోయారు. కాలేజీ, హాస్టల్ రోజులను తలచుకొని.. ఆ రోజులు మళ్లీ రావు అనుకుంటూ.. ఒకరినొకరు కుశల ప్రశ్నలు అడిగి జూబ్లీ బంధం విడదీయలేనిది అని, వచ్చే వార్షికోత్సవంలోనూ కలుద్దామని వీడ్కోలు తీసుకున్నారు.
ఆదివారం హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో కర్నూలు సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల 2026 వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. క్రమశిక్షణ-నైతికతలకు నిలయంగా నిలిచిన ఈ కళాశాల ఎందరో మేధావులను దేశానికి అందించడం మనందరికీ గర్వకారణం.ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈ కళాశాల అందించిన క్రమశిక్షణ, నైతిక విలువలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి ఒక గొప్ప కానుక.
ఓర్పు, దీక్ష, నిరంతర కృషి లేకుండా ఏ రంగంలోనూ శాశ్వత విజయం సాధ్యం కాదు. డిగ్రీ అయిపోగానే కేవలం ఉద్యోగం కోసం ఎదురుచూసే “ఉద్యోగార్థులుగా” కాకుండా, పది మందికి ఉపాధి కల్పించే “ఉద్యోగ కల్పనదారులుగా” యువత మారాలి. బోధన కేవలం తరగతి గది నాలుగు గోడలకే పరిమితం కాకూడదు. పరిశ్రమల అవసరాలకు, కళాశాలల సిలబస్‌కు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాలి. ఉపాధ్యాయులు కేవలం పాఠం చెప్పి వెళ్లే బోధకులుగా కాకుండా, విద్యార్థులకు మంచి మార్గదర్శకులుగా నిలవాలి. సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తించాలి. కేవలం సంపాదన ఒక్కటే జీవితం కాదు; మనం నివసించే సమాజానికి, దేశానికి మనం ఏమి తిరిగి ఇస్తున్నాము అనే స్పృహ ప్రతి యువకుడిలోనూ కలగాలి.— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) October 4, 2026