పెద్దపల్లి కమాన్, అక్టోబర్ 7 : పెద్దపల్లి డీఈవో మాధవి అవినీతికి పాల్పడుతూ, అధికార దుర్వినియోగం చేస్తున్నదని ఇటీవల విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన పిర్యాదు నేపథ్యంలో వరంగల్ ఆర్జెడీ సత్యనారాయణ రెడ్డి విచారణ చేపట్టారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆర్జెడీ సందర్శించారు. అనంతరం అదే పాఠశాలలోని ఓ ప్రత్యేక గదిలో డీఈవోపై ఫిర్యాదు చేసిన జూలపల్లి మండల కేంద్రానికి చెందిన అమరగాని ప్రదీప్ కుమార్ నుంచి ఆర్జెడీ వివరాలు సేకరించారు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించాలని కోరినట్లు తెలిసింది. సుమారు గంటపాటు ఆర్జెడీ విచారణ చేశారు. కాగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఈవోపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని అర్జెడీ సత్యనారాయణ ను ‘నమస్తే తెలంగాణ’ ప్రశ్నించగా, పిర్యాదులపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు. విచారణలో తేలిన అంశాలను రాష్ట్ర విద్యా శాఖకు సమర్పించనున్నట్లు తెలిపారు.