SSC Paper Leak | జర్నలిస్టు అయిన ప్రశాంత్ సమాచారం పంపడం తప్పా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రశాంత్ జర్నలిస్టు కాదు. ఆయన ఇప్పుడు ఏ మీడియా సంస్థలోనూ పనిచేయడం లేదు. ఆయన బీజేపీ ‘నమో’ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు.
వాట్సాప్‌లో ప్రశ్నపత్రం ఫార్వర్డ్ చేసిన వాళ్లందరిపైనా కేసులు పెడతారా? అని కొందరు అడుగుతున్నారు. ఈటల, ఆయన పీఏ సహా అనేక మందికి పేపర్ చేరింది. వాళ్లందరిపైనా కేసు పెట్టామా? లీకేజీలో ముందు నుంచీ పాత్ర ఉన్నవారిపైనే కేసు పెట్టాం.
బండి- ప్రశాంత్ మధ్య గట్టి సంబంధాలున్నాయి. ప్రశాంత్ వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లనే విలేకరుల సమావేశాల్లో బండి మాట్లాడేవాడు. కమలాపూర్ స్కూల్ నుంచి హిందీ పేపర్ బయటకు తెచ్చేందుకు పిల్లలను వాడారు.
ఒక ఎంపీని వారెంటు ఇవ్వకుండా అరెస్టు చేస్తారా? అని కొందరు అడుగుతున్నారు. సీఆర్పీసీలోని 41, 41(ఏ) సెక్షన్ల ప్రకారం వారెంటు, నోటీసు లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. సంజయ్ ఎంపీ కాబట్టి అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చాం.
ఉదయం 9.45కు హిందీ పేపర్‌ను ఫొటో తీయించారు. 9.59కి దీన్ని వాట్సాప్‌ల్లో సర్క్యులేట్ చేశారు. కానీ ఏ3 మహేశ్ నుంచి ఏ2 ప్రశాంత్‌కు ఉదయం 9.30కే ఒక మెసేజ్ వెళ్లింది. ‘మామా పేపర్ లీక్ చేసినవా?’ అన్నది ఆ మెసేజ్. లీకేజీకి ముందే కుట్ర పన్నారనడానికి ఇదొక ప్రబల సాక్ష్యం.
బండి ఫోన్ నంబర్ (76800 06600)లో ప్రశాంత్‌తో అనేక చాటింగ్‌లు, ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఆ ఫోన్ ఇవ్వాలని అడిగితే బండి సంజయ్ పోయిందంటున్నారు. అందులో డాటాను కూడా డిలీట్ చేసినట్టు అనుమానా లున్నాయి. తప్పు చేయకపోతే ఫోన్ ఇవ్వడానికి భయమెందుకు? ఫోన్ దర్యాప్తు కోసం ఎందుకివ్వరు? దాన్నెందుకు దాచారు?
– వరంగల్ సీపీ రంగనాథ్
వరంగల్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టెన్త్ హిందీ ప్రశ్నపత్రాన్ని పరీక్ష కేంద్రం నుంచి బయటకు తరలించిన కుట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనుసన్నల్లోనే జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. గత సోమవారమే పేపర్ లీక్‌పై మరో నిందితుడు బూరం ప్రశాంత్‌తో బండి సంజయ్ అనేకసార్లు వాట్సాప్ కాల్స్ మాట్లాడారని, ఇరువురు వాట్సాప్ చాట్ చేశారని చెప్పారు. పేపర్ లీక్ వ్యవహారం, బండి సంజయ్ అరెస్టుపై బుధవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పేపర్ లీక్ కోసం జరిగిన కుట్ర, దానిని అమలుచేసిన విధానంతోపాటు బండి సంజయ్‌ని అరెస్టు చేసిన పరిణామాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు.
ఏ1 బండి సంజయే..
టెన్త్ పేపర్ లీకేజీ కుట్ర కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) బండి సంజయేనని సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ కుట్రలో మొత్తం పదిమందిని నిందితులుగా గుర్తించామని చెప్పారు. ‘పేపర్ లీకేజీ కేసులో ఏ1గా బండి సంజయ్, బూరం ప్రశాంత్ ఏ2, గుండెబోయిన మహేశ్ ఏ3, మైనర్ బాలుడు ఏ4, మౌటం శివగణేశ్ ఏ5, పోగు సుభాష్ ఏ6, మైనర్ ఏ7, మైనర్ ఏ8, పెరుమాండ్ల శ్రామిక్ ఏ9, పోతబోయిన వర్షిత్ ఏ10గా ఉన్నారు. వీరిలో ఏ5 వరకు నిందితులను అరెస్టు చేశాం, మిగతావారు పరారీలో ఉన్నారు. పేపర్ లీకేజీ కోసం వీరంతా పక్కా ప్లాన్‌తో పనిచేసినట్టు ఆధారాలు లభించాయి. బూరం ప్రశాంత్, మహేశ్ చాలా మందికి వాట్సాప్‌లో పేపర్ పంపారు. వీరిద్దరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి పేపర్‌ను వాట్సాప్ చేశారు. దీనిపై ముందురోజు బండి సంజయ్, ప్రశాంత్ వాట్సాప్‌లో మాట్లాడుకొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా అందరిపైనా 120బీ, 420 ఐపీసీ, 447ఐపీసీ, 505(1)ఐపీసీ, తెలంగాణ రాష్ట్ర పరీక్షల నిర్వహణ చట్టం 46, 8, 66 (డీఐటీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం’ అని వివరించారు.
బండి ఫోన్ మాయం
అరెస్టుకు ముందే బండి సంజయ్ తన ఫోన్‌ను దాచేశారని, అది ఎక్కడున్నదో తెలిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని సీపీ రంగనాథ్ తెలిపారు. ‘ఈ కేసులో బండి సంజయ్ ఫోన్ చాలా కీలకం. ఆయన 7680006600 నంబర్‌ను వాడుతున్నారు. ఫోన్ ఇవ్వాలని అడిగితే ఎక్కడున్నదో తెలియదని, కనిపించటం లేదని చెప్తున్నారు. అందులో ప్రశాంత్‌తో వాట్సాప్ చాట్స్, ఫోన్ కాల్స్ డాటాను డిలీట్ చేసి ఉండవచ్చు. ఇతర మార్గాల ద్వారా కాల్ డాటాను సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఫోన్ లభిస్తే కీలక సమాచారం బయటకు వస్తుంది. కాల్ డాటా రావాల్సి ఉన్నది. వాట్సాప్ చాటింగ్‌ను రిట్రీవ్ చేయాలి. విచారణలో అన్నీ బయటికి వస్తాయి. బండి తప్పుచేయకుంటే ఫోన్‌ను ఎందుకు దాచేశారు?’ అని ప్రశ్నించారు. ‘బూరం సతీశ్ ప్రస్తుతం జర్నలిస్టు కాదు. గతంలో అతడు హెచ్ఎంటీవీ వరంగల్ బ్యూరో ఇన్చార్జిగా పని చేశాడు. ఇప్పుడు ఏ మీడియాలోనూ పని చేయడంలేదు. నమో టీంలో పని చేస్తున్నాడు. బీజేపీ మానిటరింగ్ చేస్తున్న నమో టీంలో ఏబీఎంగా, వరంగల్ పార్లమెంట్ స్థానం బాధ్యుడిగా ఉన్నాడు’ అని వివరించారు.
చట్టప్రకారమే దర్యాప్తు
కేసు దర్యాప్తులో ఎలాంటి వివక్ష లేదని, చట్టప్రకారమే నిర్వహిస్తున్నామని సీపీ రంగనాథ్ స్పష్టంచేశారు. ‘ఫోన్లో మెసేస్ రిసీవ్ చేసుకొన్నంత మాత్రాన కేసులు పెడతారా అని కొందరు అంటున్నారు. మేం అలా ఏమీ చేయలేదు. టెన్త్ పేపర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆయన పీఏ సహా చాలామంది బీజేపీ నేతలకు వెళ్లింది. వాళ్లందరిపై కేసులు పెట్టలేదు కదా? అంతకు ముందు జరిగిన పరిణామాలు, కుట్ర ఆధారంగానే కేసు పెట్టాం. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41, 41 ఏ ప్రకారం నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉన్నది. ఈ కేసులో బండి సంజయ్ ఏ1 ఎలా అవుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నేరం చేసినవారికంటే దానికి కుట్రపన్నినవారే ప్రధాన నిందితులు అవుతారు. అందుకే ఆయనను ఏ1గా పేర్కొన్నాం. బండి సంజయ్ లోక్‌సభ సభ్యుడు అయినందున ఆయన అరెస్టు విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు తెలియపరిచాం. మాపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు ప్రకటించినట్టు తెలిసింది. 46 సీఆర్పీసీ నిబంధనల ప్రకారమే వారిపై చర్యలు తీసుకొన్నాం. విచారణలోనూ ఇదే విషయాన్ని కమిషన్‌కు నివేదిస్తాం. ఈ కేసు విషయంలో ఎవరికైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టంచేశారు.
పోలీసుల వైఫల్యం లేదు
పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసుల వైఫల్యం లేదని సీపీ రంగనాథ్ స్పష్టంచేశారు. ‘వరంగల్ కమిషనరేట్ పరిధిలో టెన్త్, ఇంటర్ కలిపి 250కి పైగా పరీక్ష కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రానికి ఇద్దరు కానిస్టేబుళ్లకంటే ఎక్కువ కేటాయించలేము. మాకు వేరే వ్యవహారాలు కూడా ఉంటాయి కదా? కమలాపూర్ బాలుర ప్రభుత్వ పాఠశాల క్యాంపస్ ఏడు ఎకరాల్లో ఉంటుంది. చాలామంది పిల్లలు చెట్లు, గోడలపైకి ఎక్కుతున్నారని, తాము వెళ్లగానే పారిపోతున్నారని మా కానిస్టేబుళ్లు చెప్తున్నారు. అందువల్ల ఇతర శాఖల సిబ్బందిని పరీక్షల నిర్వహణకు వాడుకోవాలని విద్యాశాఖ మంత్రికి విన్నవించాం. రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. ఇటీవల వివిధ కేసుల్లో వరంగల్‌లో అన్ని పార్టీల వారిని అరెస్టు చేశాం. వీరిలో బీఆర్ఎస్ వారే ఎక్కువ మంది ఉన్నారు’ అని చెప్పారు.
మామా పేపర్ లీక్ చేసినవా?
హిందీ పేపర్ లీక్ వెనుక పక్కా కుట్ర దాగి ఉన్నదనేందుకు ఏ2 ప్రశాంత్, ఏ3 మహేశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణే ఉదాహరణ అని సీపీ రంగనాథ్ తెలిపారు. పేపర్ లీక్ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ముందే ప్లాన్ వేసుకున్నారు. తెలుగు పరీక్ష రోజు ఇలాగే చేశారు. ఉదయం 9.30 గంటలే మూడో నిందితుడు మహేశ్ పేపర్ లీక్ అని స్టేటస్ పెట్టాడు. హిందీ పేపర్ లీక్ చేసినవా మామా? అని ప్రశాంత్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పంపాడు. అంతా ముందుగా అనుకున్న ప్రకారమే జరిగినట్టు తెలుస్తున్నది. తెలుగు పేపర్ కూడా ప్రణాళిక ప్రకారమే బయటకు తెచ్చారు. ఇదంతా గేమ్ ప్లాన్‌లో భాగమే
– సీపీ రంగనాథ్.
టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర సుస్పష్టమని సీపీ రంగనాథ్ తెలిపారు. ‘కమలాపూర్‌లోనే ఎందుకు పేపర్ లీకైందన్నదానిపై ఆరా తీశాం. ముందుగా మాట్లాడుకొని గేమ్ ప్లాన్ ప్రకారం కమలాపూర్ నుంచి పేపర్ లీక్ చేశారు. పేపర్ లీకేజీకి సూత్రధారి బండి సంజయ్. బూరం ప్రశాంత్ చైన్ లింక్ ద్వారా వైరల్ చేశారు. హిందీ పరీక్ష ముందు రోజు సాయంత్రం బూరం ప్రశాంత్ బండి సంజయ్‌తో వాట్సాప్ చాట్ చేశాడు. వాట్సాప్ కాల్ కూడా మాట్లాడుకొన్నారు. ఇది ఉద్దేశ పూర్వకంగానే జరిగింది. హిందీ పేపర్‌ను ప్రశాంత్, మహేశ్ బండి సంజయ్‌కి పంపారు. ప్రశాంత్ అదే రోజు ఉదయం 11.18 గంటలకు హైదరాబాద్‌లో మీడియా హెడ్స్‌కు పేపర్ పంపాడు. 11.24 గంటలకు బండి సంజయ్‌కి పంపించాడు. ప్రశాంత్ సోమవారం వాట్సాప్‌లో పంపిన విషయాలనే బండి సంజయ్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. మరుసటి రోజు పేపర్లలో అవే అంశాలు వచ్చాయి. లీకేజీ అని విస్తృతంగా ప్రచారం చేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేశారు కాబట్టే బండి సంజయ్‌ని ప్రధాన నిందితుడిగా పెట్టాం’ అని తెలిపారు.