వరంగల్, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సొమ్ము ఒకరిది సోకు ఇంకొకరిది అన్నట్టు ఉన్నది కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలది. వరంగల్‌ను వస్త్రనగరిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌ది అనే విషయం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవర్ని అడిగినా చెప్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని, వాటికి సకల వసతులు కల్పించి పరిశ్రమలను నెలకొల్పేందుకు అహర్నిశలు కృషి చేసింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమనీ అందరికీ తెలుసు. ఆరుగాలం కష్టపడి పంట పండించి, కుప్పనూర్చిన తరువాత పైన జెండాపెట్టేందుకు పోటీపడ్డట్టు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయని ఆదివారం చోటుచేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తట్టెడు మట్టి తీయకపోయినా.. బస్తా సిమెంట్ ఖర్చుచేయకపోయినా కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్ క్రెడిట్ కొట్లాటతో మాత్రం ఆ రెండు పార్టీలు తలమునకలయ్యాయని తేలిపోయింది.
రాష్ట్రంలో రూ.9,400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అందులో వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను పీఎం మిత్ర పథకం కింద చేపట్టామని ప్రకటించడం విమర్శలకు తావిస్తున్నది. 2017లో కేసీఆర్ హయాంలోనే వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లో దాదాపు 1,300 ఎకరాల్లో స్థల సేకరణ చేసి, కాకతీయ మెగాటెక్స్‌టైల్ (కేఎంటీపీని) పార్క్‌కు పునాది రాయి పడిన రోజే దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్, ది స్వయంవర్ గ్రూప్, గోకుల్దాస్ ఇమేజెస్, సూర్వవంశీ స్పిన్నింగ్ మిల్స్, సూర్యోదయ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, నందన్ డెనిమ్, షాహీ ఎక్స్పోర్ట్, జేకోట్ ఇండస్ట్రీస్ సహా పలు సంస్థలతో దాదాపు రూ.3,020 కోట్లతో ఒప్పందాలు కుదిరాయి. ఇందులో యంగ్వన్ అనే సంస్థది రూ.1,000 కోట్ల పెట్టుబడి అనే విషయం తెలిసిందే.
ఆయా కంపెనీలకు అవసరమైన స్థలాలను కేటాయించి, వాటి ఏర్పాటుకు మౌలిక సదుపాయాలను బీఆర్ఎస్ ప్రభుత్వమే కల్పించింది. దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్, గణేశా, గణేశా ఇన్ఫోటెక్లు తమ యూనిట్ల నిర్మాణానికి పనులు సాగుతున్న దశలోనే కిటెక్స్ అనే సంస్థ కేరళలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవటంతో, ఆ సంస్థను గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ వంటి అనేక రాష్ర్టాలు వారి రాష్ర్టాలకు ఆహ్వానించాయి. నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కిటెక్స్ చైర్మన్, ఎండీ జాకబ్ బృందాన్ని వరంగల్ టెక్స్టైల్ పార్క్ స్థలాన్ని, ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించేందుకు పంపి కిటెక్స్ సంస్థకు నమ్మకాన్ని కలిగించారు. ఆ సంస్థ 7 మే 2022న శంకుస్థాపన చేసి ప్రస్తుతం ఉత్పత్తులను మొదలుపెట్టింది.
ఉత్పత్తిలో దూసుకుపోతున్న కంపెనీలకు పీఎం మిత్రలో చోటు
దేశవ్యాప్తంగా 7 టెక్స్టైల్ యూనిట్లకు పీఎం మిత్రలో చోటుకల్పిస్తే అందులో ఒక్కటి తెలంగాణకు దక్కిందని ప్రధాని మోదీ ప్రకటించటం హాస్యాస్పదంగా ఉన్నదని పారిశ్రామికవేత్తలే కాదు కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్‌లో పనిచేసే కార్మికులే పెదవి విరుస్తున్నారు. పీఎం స్థాయిలో ఉన్న నేత వాటిని తామే స్థాపించినట్టుగా పేర్కొనడం దారుణంగా ఉన్నదంటున్నారు. రోజుకు 1.1 మిలియన్ (11లక్షల) కిడ్స్ రెడీమేడ్ వస్ర్తాలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఒక్క కిటెక్స్ వరంగల్ యూనిట్లో వాణిజ్య ఉత్పత్తులు తయారీ ప్రారంభమైందని గతేడాది సెప్టెంబర్‌లోనే కిటెక్స్ వెల్లడించింది. యంగ్వన్, గణేశా, గణేశా ఇన్ఫోటెక్ కంపెనీలు యూనిట్లను ఎప్పుడో ప్రారంభించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 26 నవంబర్ 2025న కిటెక్స్ వస్త్ర పరిశ్రమను సందర్శించారు. వరంగల్ వస్త్రనగరి వరల్డ్ క్లాస్ సిటీగా రూపుదిద్దుకుంటున్నదని సంబురపడ్డారు. ‘కేసీఆర్ దార్శనికతకు.. ప్రణాళికాబద్ధమైన ఆలోచనా విధానానికి తార్కాణం కండ్ల ముందు కన్పిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్’ అని కొనియాడారు.
మన గడప దగ్గరే ఉపాధి.. అదే నా కల
‘గత పాలకుల నిర్లక్ష్యానికి మూతపడ్డ ఆజం జాహీ మిల్లును తలదన్నేరీతిలో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్‌కు భూమి పూజ చేసుకున్నం. ఇది దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్పార్క్గా రూపుదిద్దుకోబోతున్నది. బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన నేతన్నల్లారా మీరంతా ఆత్మగౌరవంతో స్వరాష్ర్టానికి తిరిగి రావాలె. మన గడప దగ్గరే ఉపాధి దొరుకాలె. అదే నా కల’. -కేసీఆర్