Errabelli Dayakar Rao | వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో యూరియా కొరతతో రైతులు గోస పడుతున్నారు. యూరియా కోసం కేంద్రాల వద్ద అర్ధరాత్రి నుంచే రైతులు క్యూలైన్లు కట్టారు.. అయినప్పటికీ అధికారులు మాత్రం సమయానికి రాలేదు. వచ్చిందే ఆలస్యంగా అంటే.. అందరికీ యూరియా ఇవ్వలేదు. అందరికీ సరిపోయేంత యూరియా లేదని రైతులను వెనక్కి పంపించారు. దీంతో ఆవేదన చెందిన రైతులు.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఫోన్ చేశారు. తమ బాధను ఎర్రబెల్లితో పంచుకున్నారు.
వెంటనే స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండల కేంద్రంలోని కల్లెడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి వెళ్లారు. అక్కడ రైతుల దీనస్థితిని చూసి చలించిన ఎర్రబెల్లి.. అధికారులకు ఫోన్ చేసి రైతుల సమస్యను వివరించారు. రైతులకు సరిపడా యూరియా తక్షణమే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో రాజులుగా బతికిన రైతులు.. ఈ దుర్మార్గ పాలనలో ఎరువుల కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితికి వచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తెలంగాణలో రైతు రాజ్యంగా ఒక వెలుగు వెలగగా నేడు రాక్షస రాజ్యం నడుస్తుందని విమర్శించారు. ఎరువుల సరఫరాలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. నాడు కేసీఆర్ హయాంలో ఆరు నెలల ముందే ఎరువులు నిలువ చేసి రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసే వారు కానీ ఈ ప్రభుత్వానికి ముందు చూపులేక రైతులను ఆగం చేస్తున్నారని అన్నారు.