Ration Cards | వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం చూపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులకు బదులుగా తమ ఫొటోలతో ప్రైవేటు రేషన్ కార్డులు ముద్రించి పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రంలో రేషన్ కార్డులను డిజిటల్ వర్షన్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో కార్డు ఉంటే వాటిమీదనే బియ్యం, నూనె, చక్కెర, ఇతర నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. దీంతో దీన్ని ఆసరాగా చేసుకున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు.. రేషన్ కార్డులను తమ ప్రచారానికి అనుకూలంగా మార్చుకున్నారు. ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు వచ్చినవారికి.. తామే సొంతంగా రేషన్ కార్డులను ముద్రించి ఇచ్చారు. ఇందుకోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇక్కడే కాంగ్రెస్ నాయకులు కొంచెం అత్యుత్సాహం చూపించారు.ఈ ప్రైవేటు రేషన్ కార్డులపై రాష్ట్ర, జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకుల ఫొటోలతో పాటు తమ ఫొటోలను కూడా ప్రింట్ చేయించాడు కాంగ్రెస్ పార్టీ గోపనపల్లి గ్రామ అధ్యక్షుడు నాగార్జున. బ్యాక్‌గ్రౌండ్‌లో కాంగ్రెస్ లోగో, తమ ఫొటోలతో ముద్రించి, పంపిణీ చేసిన రేషన్ కార్డులపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నాగార్జునపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రైవేటుగా రేషన్ కార్డులను ముద్రించి, పంపిణీ చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడం గమనార్హం.