Warangal | వరంగల్ లీగల్ : ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానులకే మత్తుమందు ఇచ్చి ఇంట్లోని బంగారు ఆభరణాలను చోరీ చేసిన దంపతులకు పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ వరంగల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ అబ్దుల్ రబీ తెలిపిన వివరాల ప్రకారం.. దాసరి కొమరయ్య దంపతులు శివనగర్‌లో నివాసం ఉంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంశైలనిపల్లికి చెందిన గుంజ పద్మ అలియాస్ పెద్దిట్లమ్మ, బత్తుల బాబు దంపతులు వీరి ఇంట్లో కిరాయికి దిగారు.
కొంతకాలంగా నమ్మకంగా ఇంటి యజమానులతో వ్యవహించారు. 13-02-2015 రోజున దంపతులు తమ పెళ్లి రోజు అని నమ్మించి ఇంటి యజమానులు, చుట్టపక్కల వారికి ఓ మత్తు పదార్థం కలిపిన సేమియా పాయసం అందించారు. అది తిన్న వృద్ధ దంపతులు కొద్దిసేపటికే కోమాలోకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దంపతులు అందినకాడికి బంగారు ఆభరణాలు, ఇంట్లోని వస్తువులను దోచుకొని పోయారు. అయితే, మరుసటిరోజు వృద్ధ దంపతులు ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానంతో చుట్టుపక్కల వారు సమీపంలో ఉండే వారి కొడుక్కి సమాచారం అందించారు.
తలుపులు బద్దలుకొట్టి చూడగా.. అపస్మారక స్థితిలో కనిపించారు. అలాగే ఇంట్లోని వస్తువులు కనిపించకపోవడంతో విషయం గ్రహించి మిల్స్ కాలోనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ, ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత కిలాడీ దంపతులను పనేని తేలింది. కేసు సాక్షాధారాలతో రుజువుకావడంత వరంగల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మండ వెంకటేశ్వరరావు ఈ ఇద్దరికీ 10 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. ఈ కేసులో కోర్టు డ్యూటీ ఆఫీసర్ దౌడు ప్రతాప్, లైసెన్ ఆఫీసర్ ఎం వెంకటస్వామి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.