వరంగల్: ప్రసిద్ధ భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో (Bhadrakali Temple) శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రకాళీ అమ్మవారిని గాయత్రీదేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లలో బారులు తీరారు. భద్రకాళీ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. దర్శనమిస్తున్నారు.
కాగా, ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చారు. ఉదయం మకర, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ధ్వజారోహణంతో మొదలయ్యే శరన్నవరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవంతో ముగియనున్నాయి.
భద్రాద్రి సీతారామచంద్రస్వామివారి ఆలంయలో దేవిశరన్నరాత్రి మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. లక్ష్మీతాయరు అమ్మవారు సంతానలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి మహానివేదన, అనంతరం మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహిచారు. అమ్మవారికి సాయంత్రం విశేష దర్బారు సేవ, మంత్రపుష్పం, తిరువీధి సేవ నిర్వహిస్తారు.
ఇక మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన నేడు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.