Warangal | ఖిలావరంగల్, అక్టోబర్ 29 : వాతావరణశాఖ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టర్ తహసీల్దార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.. మండలాల్లో పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా అత్యవసర సహాయార్థం వరంల్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలోని టోల్ ఫ్రీ నెం.18004253424, 9154252936, జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసి కంట్రోల్ రూంలోని టోల్ ఫ్రీ నెం. 18004251980, మొబైల్ 97019 99676 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అలాగే ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద సంకేత బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో రవాణా, విద్యత్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు వారివారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్న వెంటనే పూర్తిచేయాలనయనారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, జడ్పీ సీఈవో రాంరెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.