Power Index : ఆసియా (Asia) లో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ (India) తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఆస్ట్రేలియా (Australia) కు చెందిన ప్రఖ్యాత థింక్ట్యాంక్ ‘లోవీ ఇన్స్టిట్యూట్’ విడుదల చేసిన ‘ఆసియా పవర్ ఇండెక్స్ 2025 (Asia Power Index – 2025)’లో భారత్ మూడో ర్యాంకు (Third rank) ను కైవసం చేసుకుంది. ఈ జాబితాలో అమెరికా (USA) అగ్రస్థానంలో నిలువగా, చైనా (China) రెండో స్థానంలో ఉంది.
ఆసియాలోని 27 దేశాలు, ప్రాంతాల సమగ్ర శక్తిసామర్థ్యాలను అంచనా వేస్తూ లోవీ ఇన్స్టిట్యూట్ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తున్నది. సైనిక సామర్థ్యం, ఆర్థిక సంబంధాలు, దౌత్యపరమైన పలుకుబడి, సాంస్కృతిక ప్రభావం లాంటి 8 అంశాల పరిధిలోని 131 సూచికల ఆధారంగా ఈ ర్యాంకింగ్లను కేటాయించారు. ఈ ఏడాది భారత్ 40 పాయింట్ల స్కోరుతో తన ర్యాంకును పదిలం చేసుకుంది. అంతేగాక తొలిసారి ‘మేజర్ పవర్’ హోదా అందుకుంది.
కరోనా మహమ్మారి తర్వాత బలమైన ఆర్థిక పునరుజ్జీవనం, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ప్రాబల్యం, సైనిక సామర్థ్యం మెరుగుపడటం వంటి కారణాలతో భారత్ శక్తి పెరిగిందని లోవీ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ముందున్నప్పటికీ.. చైనాతో పోల్చినప్పుడు మాత్రం ఇంకా వ్యత్యాసం ఉన్నదని నివేదిక స్పష్టంచేసింది.
ఈ జాబితాలో 81.7 స్కోరుతో అమెరికా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా.. 73.7 స్కోరుతో చైనా రెండో స్థానంలో నిలిచి అమెరికాతో అంతరాన్ని తగ్గించుకుంటోంది. మరోవైపు 2019 తర్వాత రష్యా తన శక్తిని తిరిగి పుంజుకోవడం ఈ నివేదికలో ఒక ముఖ్యమైన అంశంగా నిలిచింది. జపాన్ శక్తి నిలకడగా ఉండగా.. ఆగ్నేయాసియా దేశాలు స్వల్ప మెరుగుదలను కనబర్చాయి.