హాంగ్‌కాంగ్: హాంగ్ కాంగ్(Hong Kong) రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 128కి చేరుకున్నది. ఆ టవర్స్‌లో మరికొంత మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. టవర్స్ వద్ద బాధితుల కోసం గాలింపు కొనసాగుతున్నదని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా కార్యదర్శి క్రిస్ టాంగ్ తెలిపారు. వాంగ్ పుక్ కోర్టు కాంప్లెక్స్‌లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం ఆ మంటల్ని ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు 79 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే మరణించిన వారిలో ఇంకా 89 మంది మృతదేహాలను గుర్తించలేదని అధికారులు చెప్పారు.
అగ్నిమాదం జరగడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. అయితే లోయర్ లెవల్లో మొదలైన మంటలు.. ఆ తర్వాత పై అంతస్తులకు పాకినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ దేని వల్ల ప్రమాదం జరిగిందన్న విషయం ఇంకా తెలియలేదన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. మంటలు పూర్తిగా వ్యాపించిన సమయంలో.. ఆ టవర్స్ వద్ద 500 సెంటిగ్రేట్ టెంపరేచర్ ఉన్నట్లు తెలిపారు. ఆ వేడి ధాటికి అర్పిన ప్రదేశాల్లోనూ మళ్లీ మంటలు అంటుకున్నట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నది.
గత ఆరు దశాబ్దాల కాలంలో హాంగ్ కాంగ్లో జరిగిన అతి భారీ అగ్నిప్రమాదమని అధికారులు తెలిపారు. భవనాలకు ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని, వాటి కోసం ఎక్కువగా వెదురు స్కా ఫోల్డింగ్, ఫోమ్ పదార్ధాలు వాడటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అగ్నికిలలను ఆర్పేందుకు 391 ఫైర్ ఇంజిన్లు రంగంలో దిగాయి. 188 అంబులెన్సులు వాడినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 2311 మంది అగ్నిమాపక సిబ్బంది .. మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. 12 మంది సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. అయితే బిల్డింగ్ లోపల భాగంలో మంటల్ని ఆర్పే విషయంలో హెలికాప్టర్లు పనిచేయవు కాబట్టి వాటిని వాడలేదన్నారు. డ్రోన్స్‌ను కూడా వాడలేని అధికారులు చెప్పారు.
బాధితుల కోసం ఆ టవర్స్‌లో ఉన్న సుమారు వెయ్యి ఇండ్లల్లో గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.