హైదరాబాద్, ఏప్రిల్4 (నమస్తే తెలంగాణ): వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (వ్యాప్కోస్)లో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్థకు ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ల తయారీ బాధ్యతలను ఇతర సంస్థలకు అప్పగిస్తుండటంతో వ్యాప్కోస్‌కు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. ఫలితంగా ఆర్థిక భారంతో ఉద్యోగులను తొలగించుకునే పరిస్థితి ఆ సంస్థకు తలెత్తింది. 1969లో కేంద్ర ప్రభుత్వం జల్‌శక్తి శాఖ పరిధిలో వ్యాప్కోస్ను ఏర్పాటు చేసింది. పలు దేశాల్లో అనేక సంక్లిష్ట ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసి ‘మినీ రత్న’ ప్రభుత్వ రంగసంస్థగా ఎదిగిన వ్యాప్కోస్ ప్రధానంగా నీటివనరుల ప్రాజెక్టులు, విద్యుత్తు, మౌలిక వసతుల రంగాల్లో కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్నది. కానీ, ప్రస్తు తం ప్రాజెక్టులు లేక రోజురోజుకూ డీలా పడుతున్నది. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అనాలోచిత విధానాలే ప్రధాన కారణమని తెలుస్తున్నది. ఇప్పుడు వ్యా ప్కోస్ వివిధ విభాగాల్లోని ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 700 మంది ఉద్యోగులను తొలగించేందకు చర్యలు చేపట్టిన వ్యాప్కోస్.. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. ఒప్పందం గడువు ముగిసిన ఉద్యోగుల కాంట్రాక్టులను పొడిగించవద్దని ఆదేశాలు జారీచేసింది.
కాంగ్రెస్ సర్కార్‌దీ అదే తీరు
రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణలో అ నేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు వ్యా ప్కోస్ సేవలు అందించింది. గతం లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్ర భుత్వం వ్యాప్కోస్ అభ్యున్నతికి చేయూతనిచ్చింది. తెలంగాణలోని అనేక ప్రాజెక్టుల బాధ్యతలను ఆ సం స్థకు అప్పగించేందుకే తొలి ప్రాధాన్యమిచ్చింది. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ వ్యాప్కోస్ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. పలు ప్రాజెక్టుల కన్సల్టెన్సీ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తుండటంతో వ్యాప్కోస్‌కు రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా పోయింది.