Runa Mafi | నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఆగస్టు 29: అర్హతలున్నా రుణమాఫీ కాని రైతులు గర్జించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ గురువారం జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలో ధర్నాలు చేపట్టారు. కాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నిర్వహించిన అఖిలపక్ష మహాధర్నాలో మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన వందలాది మంది రైతులు పాల్గొన్నారు. మొదట మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి ర్యాలీగా 63వ జాతీయరహదారి మీదుగా పాత బస్టాండ్ వద్దకు చేరుకున్నారు.
శాస్త్రీచౌక్ వద్ద రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. నినాదాలతో హోరెత్తించారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందంటూ మండిపడ్డారు. సుమారు గంటన్నరపాటు రైతుల మహాధర్నా చేపట్టగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ ఉమామహేశ్వర్రావు రైతుల వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
కాగా ఇదే జిల్లాలోని మేడిపల్లిలోనూ రైతులు ధర్నాకు దిగారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు నిరసన తెలిపారు. సర్వర్ డౌన్ కావడంతో రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు.
సంగారెడ్డి కలెక్టరేట్/బచ్చన్నపేట/రామగిరి, ఆగస్టు 29: ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఆయా జిల్లాల్లోని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నల్లగొండ కలెక్టరేట్, భువనగిరి ఆర్డీవో కార్యాలయం, మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.