న్యూఢిల్లీ, మే 10: భారతీయ రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ సమస్య ప్రయాణికులకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. రైల్వేలో నెలకొన్న ‘వెయిటింగ్ లిస్ట్ సంక్షోభం’తో కోట్లాది మంది ప్రయాణికులు రైలు ఎక్కలేకపోతున్నారని తాజాగా గణాంకాలు విడుదలయ్యాయి. దీనిపై వెలువడిన ఆర్టీఐ సమాచారం ప్రకారం, టికెట్స్ ఖరారు కాకపోవటంతో 2025-26లో సుమారు 3.39 కోట్లమందికిపైగా ప్రయాణికులు తమ రైలు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రైలులో వివిధ తరగతుల వారీగా రద్దయిన టికెట్ గణాంకాల్ని విశ్లేషించగా, స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ ప్రయాణికులపై భారం ఎక్కువగా పడుతున్నది. తమ రైల్ టికెట్ ‘వెయిటింగ్ లిస్ట్’లోనే ఉండటం వల్ల ప్రతి రోజూ దేశవ్యాప్తంగా 92,877 మంది తమ రైలు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. అలాగే ప్రతి గంటకు 3,870 మందిపై, ప్రతి నిమిషానికి 64 మంది ప్రయాణికులు ఈ సంక్షోభానికి గురయ్యారు. ప్రతి సెకన్‌కు ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణికుడు దీనివల్ల ప్రభావితమవుతున్నాడు. స్లీపర్ క్లాస్ క్యాటగిరీలో ప్రయాణికులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 1.68 కోట్ల మంది ప్రయాణాలు రద్దయ్యాయి.