హైదరాబాద్, జూన్25 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్ర యువతకు రాజీవ్ యువ వికాసం(ఆర్‌వైవీ) పథకం కింద సబ్సిడీ రుణాలిస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఏటా 5,000 మందికి మంజూరు చేస్తాం. ఈ పథకం కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నాం’ అని అసెంబ్లీ వేదికగా అట్టహాసంగా కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రకటనకు ఏడాదిన్నర దాటినా అతీగతీ లేదు. నిరుడు జూన్ 2వ తేదీన రాష్ర్టావిర్భావ వేడుకల సందర్భంగా ఆ రుణాలను మంజూరు చేస్తామని పత్రికా ప్రకటనలతో ఊదరగొట్టింది. కానీ, ఈ ఏడాది జూన్ 2 దాటినా ఏ ఒక్కరికీ పైసా ఇవ్వలేకపోయింది. అసలు యువతీ యువకులు ఏడాదిన్నర క్రితం చేసుకొన్న ఆర్‌వైవీ దరఖాస్తులు ఉన్నాయా? లేవా? అన్నది కూడా అంతుచిక్కని పరిస్థితి నెలకొన్నది. రుణ సదుపాయాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 16.23 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఎదురుచూపులే మిగిలాయి.
రాజీవ్ యువవికాసం పథకం కింద యువతకు సబ్సిడీ రుణాలను ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. పథకం కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు అప్పుడే వెల్లడించింది. ప్రతీ నియోజకవర్గంలో 5,000 మంది యువతకు 2025 జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు రుణాలను మంజూరు చేస్తామని గొప్పగా చెప్పింది. ఈ పథకం కింద రుణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 16,23,643 మంది యువతీ, యువకులు దరఖాస్తు చేసుకొన్నారు. ఇప్పటికీ ఒక్కరికీ పైసా రుణసాయం ఇవ్వలేదు. ఈ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు 10నుంచి 30 శాతం వరకు సబ్సిడీ రుణాల కోసం 2025 ఏప్రిల్14 వరకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అందులో ఎస్సీలు 3,64,691, ఎస్టీలు 1,74,365, బీసీలు 7,28,229, ఈబీసీలు 31,998, మైనారిటీలు 1,82,186, క్రిస్టియన్ మైనారిటీలు 3,712 మంది ఉన్నారు.
సబ్సిడీ రుణ మొత్తాన్ని 5 రకాల యూనిట్లుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. కేవలం రూ.50వేల యూనిట్ మాత్రమే నూరు శాతం సబ్సిడీతో అందించనున్నట్టు తెలిపింది. ఆపైన అంటే రూ.లక్ష యూనిట్లో రూ.90 వేలు ప్రభుత్వం, 10 వేలను రుణంగా, రూ.2లక్షల యూనిట్లో రూ.1.60 లక్షలను ప్రభుత్వం, మిగతా రూ.40 వేలను బ్యాంకు రుణంగా, రూ.3 లక్షల యూనిట్లో రూ.2.10 లక్షలను ప్రభుత్వం, మిగతా రూ.90 వేలను బ్యాంకు రుణంగా, రూ.4 లక్షల యూనిట్లో రూ.2.80 లక్షలను ప్రభుత్వం, మిగతా రూ.1.20 లక్షలను బ్యాంకు రుణంగా అందివ్వాలని నిర్ణయించింది.
రుణాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి 5 విడతల్లో రుణాలను మంజూరు చేస్తామని ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించింది. 2025 జూన్‌లో రూ.50 వేల నుంచి లక్ష యూనిట్‌ను 85,000 మందికి, జూలైలో రూ.1లక్ష-2లక్షల యూనిట్లను ఒక లక్ష మందికి, ఆగస్టులో రూ.2లక్షల-3లక్షల యూనిట్లను మరో లక్ష మందికి, సెప్టెంబర్‌లో రూ.2లక్షలు-4లక్షలు యూనిట్లను ఇంకో లక్ష మందికి, అక్టోబర్‌లో రూ.2లక్షల-4లక్షల యూనిట్లను 1,08,234 మందికి అందించనున్నట్టు ప్రకటించింది. మొత్తంగా 4,93,234 మందికి రూ.6,250.50 కోట్ల సబ్సిడీ రుణాలను విడుదల చేస్తామని పత్రికా ప్రకటనలు సైతం జారీచేసింది.
ఆర్‌వైవీ పథకం కింద 4,93,234 మందికి మాత్రమే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల ఎంపికకు 2025 ఫిబ్రవరిలోనే మార్గదర్శకాలను జారీచేసింది. జనాభా దామాషా, క్యాటగిరీల వారీగా యూనిట్లకు 2025 మే 20లోగా అర్హులను మండలస్థాయి కమిటీలు ఎంపిక చేయాలి. ఆ జాబితాను పంపితే ఆ జిల్లా కమిటీలు 31లోగా తుది జాబితాను సిద్ధం చేసి, ఇన్చార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారులను ప్రకటించాలి. 2025 జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు లబ్ధిదారులకు రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని నాడు రెండు నెలల ముందు నుంచే సర్కార్ ఊదరగొట్టింది. ప్రొసీడింగ్ ఆర్డర్స్ సిద్ధం చేయాలని అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. కానీ, ఇప్పటికీ అర్హుల జాబితాను ఎక్కడా ప్రకటించలేదు.
తొలుత రుణాల మంజూరు ప్రక్రియను చేపట్టిన హడావుడి చేసిన సర్కార్ కనీసం లక్షలోపు రుణాలను సైతం ఇప్పటికీ ఇవ్వలేకపోయింది. దరఖాస్తుదారుల్లో దాదాపు 70 శాతం మంది యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే మొండిచెయ్యి చూపింది. ప్రతి 10 మందిలో కేవలం 3 రుణాలనే ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. సబ్సిడీ రుణాల కోసం వచ్చిన 16,23,643 దరఖాస్తుల్లో దాదాపు 75 శాతానికి పైగా అర్జీలు కేవలం 4లక్షల లోపు యూనిట్లకే దరఖాస్తులు పెట్టుకొన్నట్టు అధికారిక గణాంకాలే వివరిస్తున్నాయి. సర్కార్ మాత్రం కేవలం 3లక్షల యూనిట్లను మాత్రమే మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ యూనిట్లలో కోత విధించాలని సర్కార్ నిర్ణయించింది. 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపా యల యూనిట్లకే ప్రాధాన్యం ఇవ్వాలని, తద్వారా ఎక్కువ మందికి ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకొనే అవకాశమూ ఉంటుందని సూత్రప్రాయ అంగీకారానికి గతంలోనే వచ్చింది. అందుకు అనుగుణంగా అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. యూనిట్లను మార్పు చేసేందుకు ఎంపీడీవోలకు అవకాశం కల్పించింది. ఎంపీడీవో లాగిన్ నుంచి యూనిట్లను మార్పు చేయొచ్చని తెలిపింది.