యాదాద్రి, ఫిబ్రవరి 8: మార్చి 28న యాదాద్రి స్వయంభువుల దర్శనం పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో అందుకనుగుణంగా భక్తుల వసతుల కల్పనపై వైటీడీఏ అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే యాదాద్రి కొండపై ఈవో కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. కాగా వీవీఐపీ భవనాల నిర్మాణం పూర్తికాగా ఈ నెల 12న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకుగాను వైటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీల విడిది కోసం కొండ దిగువన ఉత్తరాన 13.26 ఎకరాల చిన్న కొండపై 14 విల్లాలు, ఒక ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మించారు. దాతల ఆర్థిక సహకారం రూ.143.08 కోట్లతో నిర్మాణం చేపట్టగా పనులు పూర్తయ్యాయి. ఇందులో సుమారు రూ.17 కోట్ల వ్యయంతో 15,500 చదరపు అడుగుల స్థలంలో ప్రెసిడెన్సియల్ సూట్‌ను కొండ శిఖరాగ్రాన కట్టారు. కింది ప్రాంగణంలో నాలుగు విల్లాలు, దిగువన మరో పది విల్లాలు నిర్మించారు. ఒక్కోదాన్ని 7,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండంతస్తులుగా నిర్మించారు. ఇందుకుగాను ఒక్కో విల్లాకు సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేశారు. యాదాద్రీశుడిని దర్శించుకొని తిరిగి ప్రెసిడెన్సియల్ సూట్‌కు చేరుకొనేలా ప్రత్యేకంగా రోడ్లను నిర్మించారు.