హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం త్వరలో గ్రామాల్లో నియమించనున్న రెవెన్యూ అధికారులకు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (వీఏవో) పేరు నిర్ణయించినట్టు తెలిలిసింది. భూ భారతి చట్టం అమలులో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున 10,950 మంది క్షేత్రస్థాయి అధికారులను నియమించేందుకు ఈ నెల 7న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ‘గ్రామ పాలనాధికారులు’గా పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను నియమించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంత మందిని తీసుకుంటారనేదానిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు భిన్నమైన ప్రకటనలు చేశారు. తాజా సమాచారం ప్రకారం మొత్తం పోస్టులను పూర్వ వీఆర్వోలు, వీఆర్వోలతో భర్తీ చేయనున్నట్టు తెలుస్తున్నది. కొన్ని నెలల కిందట వీఏవోలతోపాటు వెయ్యి మంది సర్వేయర్ల భర్తీకి విల్లింగ్ తీసుకోగా.. పెద్దగా ఆసక్తి కనిపించలేదు.
విధులు.. సర్వీస్ సంగతేంది?
రెవెన్యూలో క్యాడర్ స్ట్రెంత్, జీతభత్యాల కేటాయింపు వంటివి ఇంకా నిర్ణయం కాలేదు. వీఏవోలను ఏ పేస్కేల్‌తో తీసుకుంటారు? ఇందుకు కనీస అర్హత ఏమిటి? విధులేమిటి వంటివి కూడా ఇంకా తేలలేదు. అవి బయటికి వచ్చిన తర్వాత ఎంత మంది తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతారన్నది మరో ప్రశ్నగా ఉన్నది. నాలుగేండ్లుగా ఇతర శాఖల్లో తాము విధులు నిర్వహిస్తున్నామని, ఈ సర్వీస్‌ను కొససాగిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కనీస అర్హత డిగ్రీ ఉంటే ఇప్పుడు విల్లింగ్ ఇచ్చినవారిలో 3,500 మంది మాత్రమే వచ్చే అవకాశం ఉన్నది. అనేక అంశాలు తేలాల్సి ఉన్న నేపథ్యంలో వీఏవో వ్యవస్థ అమలు ఉగాది నుంచి కష్టమేనని సీనియర్ అదికారులు చెప్తున్నారు. ఉగాదిన లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్‌లో నియామక ప్రక్రియ జరిపే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.