హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో కొత్తగా వీఆర్వోలుగా పనిచేసేందుకు పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని రెవెన్యూవర్గాలు చెప్తున్నాయి. ఇతర శాఖల్లో పనిచేస్తున్న పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు తిరిగి వచ్చేందుకు విల్లింగ్ ఇవ్వాలని సీసీఎల్ఏ ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ గడువు శనివారంతో ముగియనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 10,434 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఒక్కో గ్రామానికి ఒక వీఆర్వోను నియమించాలని, మరో వెయ్యి మందిని సర్వేయర్లుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 11,500 మందిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తేవాలని భావించింది. గతంలో ఇతర శాఖల్లోకి సర్దుబాటు అయిన వీఆర్వోలు, వీఆర్ఏలు కలిపి దాదాపు 24 వేల మంది వరకు ఉన్నారు. దీంతో కుప్పలుతెప్పలుగా దరఖాస్తులొస్తాయని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వం అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటివరకు 3,500 మంది వరకు మాత్రమే విల్లింగ్ ఇచ్చినట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. నూతన వీఆర్వో వ్యవస్థకు సంబంధించి సర్వీస్ రూల్స్ నిర్ధారణ కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. ‘ముందు చేరండి.. ఆ తర్వాత బాధ్యతలు, సర్వీస్ నిబంధనలు తెలుస్తాయి’ అంటూ ఉన్నతాధికారులు చెప్తున్నారట. అసలు తమ పని ఏమిటో తెలియకుండా ఎందుకు వెళ్లాలని పాత వీఆర్వోలు, వీఆర్ఏలు భావిస్తున్నారు. పైగా గతంలో కన్నా అధికారాలు తక్కువగా ఉండటం కూడా మరో కారణంగా చెప్తున్నారు. విద్యార్హతలు వంటి సాంకేతిక అడ్డంకులు ఉండటంతో సర్వేయర్ పోస్టులో చేరేందుకు వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం.
వాషింగ్టన్, డిసెంబర్ 27: ఈ ఏడాది ఎండలు మండిపోయాయని.. వాతావరణ మార్పుల వల్ల సగటున 41 రోజులు అదనంగా ఎండలను భరించాల్సి వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ కార్యకలాపాల వల్ల పెరుగుతున్న వాతావరణ మార్పులపై పరిశోధన చేసిన సైంటిస్టులు గత అధ్యయనాల ఆధారంగా ఈ విషయాలను వెల్లడించారు. ‘ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించకపోయినా ఆందోళనకరం. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల జీవితాలు, జీవనోపాధులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి’ అని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అండ్ యాన్ ఇంపీరియల్ కాలేజ్ వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఒట్టో అన్నారు.