హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏల వారసులకు ఇంకెప్పుడు ఉద్యోగాలు ఇస్తారని వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వంగూరు రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో వీఆర్ఏలు, వారి వారసులు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వీఆర్ఏలు ప్రజాభవన్‌లో బైఠాయించారు. ఈ సందర్భంగా వంగూరు రాములు మాట్లాడారు.వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పేసేల్, 61 ఏండ్లు దాటినవారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామ ని బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నం.81, 85 విడుదల చేసిందని చెప్పారు. ఈ మేరకు వీఆర్ఏల్లో డిగ్రీ చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్‌గా, ఇంటర్ చదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్లుగా, పదో తరగతి చదివిన వారికి ఆఫీస్ సబార్డినేట్లుగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చిందని వివరించారు.
61 ఏండ్లకు పైబడిన 3,797 మంది వారసులకు ఉద్యోగాలు ఇస్తామని జీవోలో ఆనాటి ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఇదే విషయమై ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర నేతలు తమకు అనుకూల హామీలు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం సీసీఎల్ఏ నవీన్‌మిట్టల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసిందని గుర్తుచేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చి నెలలు గడుస్తున్నా అమలు చేయడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్న ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య హామీతో వారు ఆందోళన విరమించారు.కార్యక్రమం లో సాగర్, రమేశ్, ఆంజనేయులు, రమేశ్ పటేల్,శివ, మధు, భరత్, యాదవ్, శ్రీకాంత్, అనిల్, వెంకట్, శేఖర్, ఇమాంపాషా, సతీశ్, గంగమల్లు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో మళ్లీ డిప్యుటేషన్లు తెరపైకి వచ్చాయి. కొందరికి దొడ్డిదారిన డిప్యుటేషన్లు ఇచ్చినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యుటేషన్లు రద్దుచేసింది. ఏమైనా ప్రత్యేక కారణాలు ఉంటేనే ఇస్తామని ప్రకటించింది. ఇందుకు నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది. దరఖాస్తులు స్వీకరించి వాటిని కమిటీ పరిశీలించి డిప్యుటేషన్లు ఇస్తుందని వెల్లడించింది. వీటిని పకన పెట్టి మంగళవారం డిప్యుటేషన్ల పేరుతో వివిధ జిల్లాల నుంచి మేడ్చల్ మలాజిగిరి జిల్లాకు, అదే జిల్లాలోని ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే కొందరికి దొడ్డిదారిన డిప్యుటేషన్లు ఇచ్చినట్టు సమాచారం.