హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వీఆర్ఏలను వివిధ శాఖల్లోకి సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వీఆర్ఏ జేఏసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. జేఏసీ అధ్యక్షుడు గడ్డం రాజయ్య నేతృత్వంలో గురువారం సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు నేతలు తెలిపారు. ఇందులో ప్రధాన కార్యదర్శి దాదే మియా, కో కన్వీనర్లు షేక్ మహమ్మద్ రఫి, వై వెంకటేశంయాదవ్, వంగూరు రాములు, కే మాధవ్ నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 20,555 మంది వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయడంతోపాటు అర్హతలను బట్టి ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కల్పించినందుకు సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని నేతలు చెప్పారు.
పేస్కేల్ సాధనలో తమకు అండగా నిలిచిన ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. వీఆర్ఏ వ్యవస్థే లేనందున వీఆర్ఏ జేఏసీ కొనసాగడం సబబు కాదని పేర్కొన్నారు. తాము ట్రెసాలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు గురువారం కొందరు సంఘంలో సభ్యత్యం తీసుకున్నట్టు వెల్లడించారు.