సంస్థాన్ నారాయణపురం : మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లు ఎవరైనా పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురంలోని ఎంపీటీసీ -2లో ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మైనారిటీల ప్రాంతంలో పర్యటించిన ఆయన కారు గుర్తుకు ఎందుకు ఓటెయ్యాలో వివరంగా వివరించారు.
గతంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే బీజేపీలో చేరిన విధంగానే కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరుతారని ఎద్దేవా చేశారు. ముస్లింల సంక్షేమానికి సీఎం కేసీఆర్ షాదీ ముబారక్, ఈద్ తోఫా ఇతరత్రా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని వివరించారు.
మునుగోడు నియోజకవర్గంలోని మైనార్టీలంతా కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించు కోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపూర్ జడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేశ్, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచ్ చిక్లమెట్ల శ్రీహరి, కరీంనగర్ కు చెందిన టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.