ఆదిలాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ) : దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్‌తోపాటు అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు ఓ దివ్యాంగుడు పేర్కొన్నాడు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దివ్యాంగుడు మక్క శేఖర్ తన తల్లి లక్ష్మితో కలిసి ప్రచారానికి వచ్చాడు. ఈ సందర్భంగా శేఖర్ ఎమ్మెల్యే వద్ద మైక్ తీసుకొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలను వివరిస్తూ మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించాడు. దివ్యాంగుడు మాట్లాడుగూ..
‘సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛన్ డబ్బులు మా అవసరాలు తీరడమే కాకుండా ఇతర ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. సర్కారు అందిస్తున్న సాయంతో నేను ఇంటర్ వరకు చదువుకున్నా. ఇప్పుడు రూ.6 వేల పింఛన్ ఇస్తానని కేసీఆర్ సర్ అంటున్నరు. నాకు పది సంవత్సరాలుగా పింఛన్ వస్తున్నది. తల్లిదండ్రులు లక్ష్మి, నరేందర్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాకు పింఛన్ రాకపోతే ఇబ్బందులు పడేవాళ్లం. ఇంతకుముందు దివ్యాంగులను ఎవరూ పట్టించుకోలేదు. మా గురించి ఆలోచించి అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్న కేసీఆర్‌కే మేం అండగా ఉంటాం’ అని ప్రకటించాడు. కారు గుర్తుకు ఓటు వేసి జోగు రామన్నను మరోసారి గెలిపించుకుంటామని తెలిపాడు.