హైదరాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు ఆరు సెక్యూరిటీ ఫీచర్స్‌తో కూడిన కొత్త ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఓటర్ గుర్తింపు కార్డులకు హాలోగ్రామ్‌తో సహా ఆరు భద్రతా ఫీచర్స్‌తో నూతన డిజైన్‌ను ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ ఫైనల్ చేసిందని చెప్పారు. వీటిని తొలుత మునుగోడులో కొత్తగా నమోదైన ఓటర్లు, ఇంతకుముందు గుర్తింపు కార్డులు పొందని ఓటర్లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ కార్డులను స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపించినట్టు వెల్లడించారు. ఉపఎన్నికలో ఓటు వేయడానికి ఓటర్‌కార్డు లేనివారు ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా చూపించాలని స్పష్టంచేశారు. ఇందుకోసం 11 గుర్తింపు కార్డుల జాబితాను విడుదల చేశారు.
ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు ఇవే
పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డులు, బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్‌లు, పాన్‌కార్డ్, ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్‌కార్డ్, ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డ్, కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డ్, ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డ్‌లో ఏదో ఒక కార్డు తప్పని సరిగా చూపించాలని సీఈవో స్పష్టంచేశారు.