హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో కొనసాగిస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఢిల్లీ ప్రభుత్వ ఆత్మగౌరవానికి విరుద్ధంగా కేంద్రం తెచ్చిన ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటువేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విప్ సంతోష్‌కుమార్ సోమవారం పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశారు. పార్టీ ఎంపీలందరూ జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు విధిగా సమావేశాలకు హాజరుకావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు మొదలైన ఉద్యోగ సంబంధ అంశాలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి కేంద్రం ఇటీవల ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా లాక్కున్నది. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇటీవల స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని, తాము ఢిల్లీ ప్రభుత్వానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంతోష్‌కుమార్ విప్ జారీ చేశారు.