MLC Kavitha | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరర్రావు జన్మదినాన్ని పురస్కరించుకొని భారత జాగృతి ఆధ్వర్యంలో ‘కేసీఆర్ కప్-2023’ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కేసీఆర్-2023 కప్ టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొనాలని కవిత కోరారు.
కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, భారత్ జాగృతి జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో లాల్ బహదూర్ స్టేడియంలో మహిళలు, పురుషల విభాగంలో పోటీలు జరుగనున్నాయి. ప్రథమ బహుమతిగా ట్రోఫీ, మెడల్స్‌తో పాటు రూ.లక్ష నగదు, ద్వితీయ బహుమతిగా ట్రోఫీ, మెడల్స్‌తో పాటు రూ.75వేల నగదు, తృతీయ బహుమతిగా ట్రోఫీ, మెడల్స్ రూ.50వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
దళిత క్రైస్తవ సమ్మేళనం పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 15న దళిత క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కళాశాలలో జరగనున్న ఆత్మీయ సమ్మేళనం పోస్టర్‌ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. దళిత క్రైస్తవ అభ్యున్నతి కోసం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ జన్మదినాన్ని దళిత క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున నిర్వహించనుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్, దళిత క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.