Congress | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్‌లో ఢిల్లీ పెద్దలపై అడుగడుగున ధిక్కార స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌పై ముఖ్యనేత వర్గం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే తరహా పరిస్థితి కనిపిస్తున్నదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధిష్ఠానం జాతీయస్థాయిలో పిలుపునిచ్చిన ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్..’ కార్యక్రమాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్ర పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది.
ఎన్డీఏ సరార్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ‘జై బాపు..’ కార్యక్రమాన్ని ఏఐసీసీ తలపెట్టింది. కానీ ర్యాలీలతో పెద్దగా ఉపయోగం ఉండదంటూ రాష్ట్ర నాయకత్వంలో అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తున్నది. ఏది ఏమైనా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రోగ్రామ్‌ను విజయవంతం చేయాల్సిందేనని అధిష్ఠానం ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్‌లు పెట్టి ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తున్నది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నదని, ప్రభుత్వాన్ని, పార్టీని సమస్యలు వేధిస్తున్నాయని రాష్ట్ర నేతలు చెప్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు, ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయని వాపోతున్నారు. వాటిని తిప్పికొట్టడమే పెద్ద తలనొప్పిగా మారితే, ర్యాలీలు చేయాలంటూ ఢిల్లీ నుంచి ఒత్తిడి చేయడమేంటని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యంతో ఎమ్మెల్యేలు, నేతలు గుర్రుగా ఉన్నారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తెలంగాణలో పెద్దగా ప్రభావం లేని బీజేపీ గురించి జనంలో చర్చ పెట్టడం వల్ల ప్రయోజనమేంటని మరికొందరు కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నట్టు సమాచారం.