మంథనిలో రైతుల రాస్తారోకో
దశాబ్దాలుగా తమ పొలాల వద్దకు వెళ్లే చెరువుకట్ట, రహదారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలని పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళనకు దిగారు. శనివారం చెరువుకట్ట రోడ్డును పునరుద్ధరించే పనులను ప్రారంభించగా, కబ్జాదారులు వచ్చి అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించగా, రైతులంతా మంథనికి చేరుకొని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు.
– మంథని/మంథని రూరల్
బస్సు కోసం రోడ్డెక్కిన మహిళలు
తమ గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన మహిళలు శనివారం ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. మండల కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు మార్గం ఉన్నా.. మధ్యలో 12 గిరిజన గ్రామపంచాయతీల ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉన్నా బస్సును ఎందుకు నడపడం లేదని వారు ప్రశ్నించారు.
– టేకులపల్లి
క్వారీలో అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రైతులు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులో మోయతుమ్మెద వాగులో ప్రభుత్వ అనుమతితో నిర్వహిస్తున్న ఇసుక క్వారీలో పరిమితికి మించి, సమయం గడిచినా తవ్వకాలు చేపడుతున్నారంటూ రేణికుంట రైతులు, యువకులు ఆందోళనకు దిగారు. శనివారం మధ్యాహ్నం ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అనంతరం తహసీల్దార్ కనుకయ్యకు వినతిపత్రం అందజేశారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
– తిమ్మాపూర్
సింగరేణి క్వార్టర్లకు విద్యుత్తు నిలిపివేత

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి క్వార్టర్లను కూల్చి రోడ్లు వెడల్పు చేయాలని నిర్ణయించారు. కొందరు ఇంకా ఖాళీ చేయకపోవడంతో శనివారం 84 క్వార్టర్లకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఒకే వైపు 100 నుంచి 200 ఫీట్ల వరకు క్వార్టర్లను తొలగించి రోడ్డు వెడల్పు చేయాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాగూర్ నిర్ణయించడం సరైందికాదని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
– గోదావరిఖని