హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): చిన్నారులపై జరిగే లైంగికదాడుపై నిజాయితీగా విచారణ జరిపి, సత్వరమే శిక్షలు అమలు చేస్తే పోక్సో చట్టం ఓ గేమ్ చేంజర్‌గా మారుతుందని, పిల్లలపై అత్యాచారానికి యత్నించాలంటేనే భయపడే రోజులు రావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ పేర్కొన్నారు. లైంగిక దాడులకు గురైన చిన్నారులకు న్యాయం చేసేందుకు అన్ని విభాగాలు ఏకమవ్వాలని ఆయన ఉద్ఘాటించారు. పోక్సో చట్టంపై హైదరాబాద్‌లో జరిగిన ‘వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్’ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బాధితులకు న్యాయం చేయడాన్ని కేవలం చట్టపరమైన పరిషారాలతో ముగించకూడదని, వారికి పునరావాసం కల్పించడంతోపాటు గౌరవం, సమగ్ర చికిత్స వంటి అంశాలకూ విస్తరించాలని జస్టిస్ విక్రమ్‌నాథ్ అన్నారు. బాధిత చిన్నారులకు న్యాయం చేసేందుకు తెలంగాణలో అమలవుతున్న ‘భరోసా’ మాడల్‌ను ఆయన ప్రశంసించారు. హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ మాట్లాడుతూ.. న్యాయ ప్రక్రియలలో ఆలస్యం వల్ల బాలల భవిష్యత్తుకు తీవ్ర విఘాతం ఏర్పడతుందని చెప్పారు.
బాధితులకు న్యాయం చేసేందుకు సంబంధిత విభాగాలన్నీ సమన్వయంతో కృషి చేయాలని చెప్పారు. విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని, లైంగికదాడులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్యాంకోషీ, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు, జస్టిస్ కే లక్ష్మణ్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, యూనిసెఫ్ ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోనీకుట్టి జార్జ్, న్యాయమూర్తి తిరుమలాదేవి, జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రామకాంత్, యూనిసెఫ్, హైదరాబాద్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మురళీకృష్ణ, ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ సుధా, వికారాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌రెడ్డి, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీ చేతన, న్యాయమూర్తి నందా, రిటైర్డ్ న్యాయమూర్తి రఘునాథ్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వరరావు, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు.