హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తమిళనాడు తరహాలో విద్యా, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం స్పష్టం చేసింది. గురువారం చెన్నైలోని తమిళనాడు బీసీ భవన్లో బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో బీఆర్ఎస్ బృందం సమావేశమైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు, బీసీ అభివృద్ధి పథకాల తీరుతెన్నులను సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి విజయకుమార్ సారధ్యంలోని బీసీ సంక్షేమశాఖ అధికారుల బృందం బీసీ రిజర్వేషన్లపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో బీఆర్ఎస్ ప్రతినిధి బృందానికి వివరించారు.
బీసీ రిజర్వేషన్లు, వారి అభివృద్ధి, సంక్షేమం కోసం తమిళనాడులో అమలవుతున్న కార్యక్రమాల అధ్యయనం, తమిళ పార్టీల్లో బహుజనుల ప్రాతినిథ్యం వంటి పలు అంశాలను అధ్యయనం చేసేందుకు శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతల బృందం తమిళనాడులో పర్యటిస్తున్నది. అనంతరం బృందం సభ్యులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ తన పదేండ్ల పాలనలో వివిధ సందర్భాల్లో తమిళనాడు తరహా రిజర్వేషన్లు తమ రాష్ట్రంలో అమలు చేయాలని ప్రధాని మోదీనీ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న మాట్లాడుతు తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టంచేశారు. తమిళనాడులో రిజర్వేషన్ల అమలు విషయంపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఆరా తీసింది.
ఐలమ్మ స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల సాధన
తెలంగాణ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాడుతామని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సభ్యులు ప్రతినబూనారు. ఐలమ్య జయంతి సందర్భంగా చెన్నైలో బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఆమె చిత్రపటానికి నివాళి అర్పించి ఆమె పోరాటాన్ని స్మరించుకున్నారు. ప్రతినిధి బృందంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాసర్, పుట్టా మధు, కోరుకంటి చందర్, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు జూలూరు గౌరీశంకర్, డాక్టర్ ఆంజనేయగౌడ్, పల్లె రవికుమార్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నాగేందర్‌గౌడ్, రవీంద్రసింగ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, కిశోర్‌గౌడ్, పార్టీ సీనియర్ నేతలు దాసోజు శ్రీనివాస్, చెరుకు సుధాకర్, రాజ్యలక్ష్మి, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, విద్యార్థి సంఘం నేత దత్తాత్రేయ తదితరులు ఉన్నారు.