హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మహిళలపై హింస, పిల్లలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావ్లే ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నెల 25 నుంచి 28 వరకు బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించనున్న ఐద్వా 14వ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం ఆమె సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఐద్వా నేతలతో కలిసి మాట్లాడుతూ.. మనుస్మృతిని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి తెచ్చుకున్న రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సెక్యులరిస్టు వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పేదలుగా గుర్తించేందుకు రోజువారీ, నెలవారీ ఆదాయాన్ని తకువగా నిర్ణయించి 12 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని బుకాయిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశం వృద్ధి రేటు సాధిస్తే.. పేదరికం, పౌష్టికాహార లోపం, నిరుద్యోగం, ఉపాధి దొరకని పరిస్థితులు ఎందుకున్నాయని ప్రశ్నించారు. బీజేపీ విధానాల దుష్ప్రభావం ప్రజలపై పడుతున్నదని, మహిళలపై ఈ ప్రభావం మరింత ఎకువగా ఉంటున్నదని వివరించారు. అటవీ హకుల చట్టం, పీసా యాక్ట్ తదితర చట్టాలను ఉల్లంఘించి అకడి సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని, గిరిజన మహిళలు ఉపాధి కోల్పోయి వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా జాతీయ ఆహార భద్రతకు నిధులు కేటాయించకుండా కేంద్రం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు.
మహిళలను గౌరవించని ఆరెస్సెస్: పీకే
మహిళలు, దళితులు, మైనారిటీలంటే ఆరెస్సెస్‌కు గౌరవం లేదని ఐద్వా జాతీ అధ్యక్షురాలు పీకే శ్రీమతి టీచర్ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందినా అమలు చేసేందుకు బీజేపీ ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వివరించారు. అకడ మహిళలపై ఏదైనా నేరం జరిగితే ప్రభుత్వం వెంటనే న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. నిరుద్యోగ మహిళలకు నెలకు రూ.1,000 చొప్పున నిరుద్యోగ భృతి, ఎలాంటి పెన్షన్ లేని 62 లక్షల మందికి నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నదని వివరించారు.
ఓటుహక్కు లేకుండా చేసే కుట్ర: పుణ్యవతి
మహిళల ఓటు హకును తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని, ఇప్పటికే బీహార్‌లో పెద్ద ఎత్తున తొలగించారని ఐద్వా కోశాధికారి ఎస్ పుణ్యవతి విమర్శించారు. ఓటు హకు కావాలంటే పుట్టింటికి వెళ్లి బర్త్ సర్టిఫికెట్ తేవాలంటూ కొర్రీలు పెడుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల హకులే మానవ హకులని, వారికి సమానంగా హకులు దకినప్పుడే సమాజం బాగుంటుందని చెప్పారు. వెనిజువెలాపై అమెరికా సామ్రాజ్యవాద దాడిని వ్యతిరేకించాలని, నేడు మదురోను ఎత్తుకెళ్లిన ట్రంప్ మన వరకు రాకముందే మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మహిళలు ఎదురొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకిచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు చేస్తామని వెల్లడించారు. మహిళల వస్త్రధారణను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్, అశ్లీల చిత్రాలు, పోర్న్సైట్లను నిషేధించాలని డిమాండ్ చేశారు.