హైదరాబాద్, నవంబరు 2 (నమస్తే తెలంగాణ): మునుగోడులో ముమ్మాటికీ గెలుపు టీఆర్ఎస్దేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రస్థానానికి మునుగోడు గెలుపు శుభారంభాన్ని ఇస్తుందని తెలిపారు. మునుగోడు ప్రజలు, ఆ ప్రాంత అభివృద్ధితో టీఆర్ఎస్ మమేకమైందని చెప్పారు. ఇది తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రజలు మంచి మెజార్టీతో గెలిపిస్తారన్న విశ్వాసం ఉన్నదని చెప్పారు. బుధవారం మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రాష్ర్టానికి కానీ, దేశానికి కానీ బీజేపీ చేసిన మంచి పని ఒక్కటీ లేదని అన్నారు. రూ.18 వేల కోట్ల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి మునుగోడులో ఉప ఎన్నిక తెచ్చారని విమర్శించారు.
కాంట్రాక్టర్ రాజగోపాల్‌రెడ్డికి ఓటర్లు బుద్ధి చెప్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం భారత రాష్ట్ర సమితికి శుభారంభమవుతుందని.. పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం ఇస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతోనే.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన సభను రద్దు చేసుకొన్నారని ఎద్దేవా చేశారు. ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని బీజేపీ అనుకొన్నదని.. అందుకే మఠాధిపతుల ముసుగులో బ్రోకర్లను పంపించిందని, చివరకు వారు అనుకొన్న ప్రణాళిక విఫలం కావడంతో తోకముడిచారని చెప్పారు. 31న నడ్డా సమక్షంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికను ప్లాన్ చేశారని, కొనుగోళ్ల బాగోతం బయటపడటంతో నడ్డా రాలేదని.. చివరకు సభ కూడా పెట్టుకోలేదని పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయమవడంతో బీజేపీ నేతల్లో అసహనం పెరిగి, దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి చుట్టూ కోవర్టులే ఉన్నారని, ఆయన ఓడిపోవాలని బీజేపీలోని ఒక వర్గం బలంగా కోరుకొంటున్నదని తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ను నేరుగా ఢీకొట్టే ధైర్యం లేక ప్రస్తుతానికి రెండు బాణాలు వదిలారని, వాటి వెనుక ముమ్మాటికీ బీజేపీయే ఉన్నదని చెప్పారు. టీఆర్ఎస్ ఓట్లు చీల్చడమే వాటి లక్ష్యమన్నారు.
దేశంలోని 9 రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను విజయవంతంగా కొనుగోలు చేసి.. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీ.. తెలంగాణలో బొక్కబోర్ల పడిందని కేటీఆర్ అన్నారు. మఠాధిపతుల రూపంలో వచ్చిన బ్రోకర్ల బండారం బయటపడిందని, స్వామీజీల అవతారంలో ఉన్న దొంగలు దొరికారని చెప్పారు. పట్టుబడ్డవాళ్లు బీజేపీ వాళ్లు కాకపోతే.. ఆ పార్టీ వాళ్లు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ రామచిలుకలుగా మారాయని సాక్షాత్తూ నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రధాని అయ్యాక ఆయన కూడా వాటిని స్వప్రయోజనానికి వాడుకుంటున్నారని విమర్శించారు. అలాంటి సీబీఐకి రాష్ట్రంలో అనుమతి నిరాకరించడంలో తప్పేం లేదన్నారు.
రాష్ర్టాలను ఆర్థికంగా దెబ్బ తీయాలని కేంద్రం నిస్సిగ్గుగా చూస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ర్టానికి వచ్చే నిధులు ఇవ్వకపోగా కనీసం అప్పులు కూడా రాకుండా అడ్డుకొంటున్నారని.. యాదాద్రి థర్మల్ పవర్‌కు నిధులు ఇవ్వరాదని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌పై కేంద్రం ఒత్తిడి తెస్తున్నదని తెలిపారు. మెట్రో ఫేజ్-2కు నిధుల కోసం కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి వద్దకు వెళ్తే ఆయన నిధులు ఇవ్వలేమన్నారని తెలిపారు. కృష్ణా జలాల పంపిణీపై 8 ఏండ్లుగా కేంద్రం తాత్సారం చేస్తున్నదని విమర్శించారు.
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడం కోసం ప్రధాని ఈ నెల 11-12 తేదీల్లో వస్తున్నట్టు విన్నామని.. ఆ కర్మాగారంలో స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇవ్వాలని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కోరుతున్నారని కేటీఆర్ చెప్పారు. ప్రధాని ఈ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభానికి సంబంధించి ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎవరిపై పోరాటం చేయాలో తేల్చుకోలేకపోతున్నదని, ఆ పార్టీ ఓ జడపదార్థంలా మారిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీని నాయకత్వ సమస్య తీవ్రంగా వేధిస్తున్నదన్నారు. భారత్‌జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. బీజేపీతో ధైర్యంగా పోరాడుతున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ మాట్లాడినంత గట్టిగా దేశంలోని ఏ నేత కూడా మోదీపై, బీజేపీపై మాట్లాడలేదని స్పష్టంచేశారు.
బీజేపీతో ఒప్పందం లేకపోతే భారత్ జోడో యాత్ర గుజరాత్‌కు ఎందుకు వెళ్లడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇదంతా బీజేపీతో కాంగ్రెస్ ఒప్పందంలో భాగమేనని అంతా అనుకొంటున్నారని చెప్పారు. కేంద్రం నడిపించే ఈడీ.. రాహుల్, సోనియాలకు నోటీసులిస్తే దేశవ్యాప్తంగా వారికి మద్దతు రావాలని కోరుకొన్నారని, మిగిలిన ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రం ఉసిగొల్పి దాడులు చేయిస్తుంటే.. కాంగ్రెస్ స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు సరికాదని కేటీఆర్ హితవు పలికారు.
కాంగ్రెస్‌ను నడిపిస్తున్నది గాంధీ కుటుంబమేనని, మల్లికార్జున ఖర్గే నామ్‌కే వాస్తే అధ్యక్షుడని వ్యాఖ్యానించారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తెస్తే, దాన్ని చింపేసిన చరిత్ర రాహుల్‌కు ఉన్నదన్నారు.
దేశంలో మోదీ పాలన పేద ప్రజలపాలిట ముప్పు అని కేటీఆర్ విశ్లేషించారు. దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికలు గుజరాత్లో జరుగుతున్నాయని, మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో లోక్‌సభ ఎన్నికలు అతి ఖరీదైనవని పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం తీరు విచిత్రంగా ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, ఆయన కొడుక్కి సంబంధం లేదని ఈసీ చెప్పటాన్ని ఆక్షేపించారు. కొడుకు కంపెనీ నుంచి తండ్రి పోటీచేస్తున్న నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఓట్ల కొనుగోలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే తండ్రికి, కొడుక్కి సంబందం లేదని ఎన్నికల సంఘం చెప్తున్నదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఇప్పటివరకు ఇచ్చిన ఏ ఒక్క ఫిర్యాదుపైనా ఈసీ చర్య తీసుకోలేదని, బీజేపీ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నదని విమర్శించారు.
భారత రాష్ట్ర సమితి దీర్ఘకాలిక దృష్టితో పనిచేస్తుందని కేటీఆర్ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్మాణం ఉంటుందని వెల్లడించారు. మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి తెలంగాణ ఉద్యోగులు, వారి పోరాటాలు, త్యాగాల గురించి అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారు. 1983లోనే తెలంగాణ ఉద్యోగులు కొట్లాడి 610 జీవో తెప్పించారని వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ గురించి రాజకీయ నేతలు పార్టీలు పెట్టారు.. మూసుకొన్నారు కానీ, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) పెట్టి.. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై అసామాన్య పోరాటం చేసిన యోధులు తెలంగాణ ఉద్యోగులని తెలిపారు. ‘అలాంటివారిపై అవాకులు, చవాకులు పేలడం బీజేపీ నాయకుల అవగాహనారాహిత్యానికి నిదర్శనం’ అని కేటీఆర్ మండిపడ్డారు.
బీజేపీని దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా నమ్మదు. బీజేపీకి స్నేహితులు ఎవ్వరు లేరు. జేడీయూ, శివసేన, అకాలీదళ్, వైసీపీ, బిజూ జనతాదళ్.. ఇలా ఎవ్వరూ వారితో కలిసి లేరు. తమతో ఉన్నవారిని వాడుకోవడమే బీజేపీకి తెలిసిన విద్య. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీజేపీతో మంచిగా ఉంటున్నప్పటికీ ఆయనకు బీజేపీ చేసిందేమీ లేదు. కనీసం పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం సరిగ్గా నిధులు ఇవ్వడంలేదు. దేశంలో బీజేపీతో స్నేహం చేయాలని ఏ రాజకీయ పార్టీ కోరుకోవడంలేదు.
దురదృష్టవశాత్తూ గవర్నర్ల వ్యవస్థ కూడా అలాగే మారిపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడాలని, ప్రజల్లో నిరాశ, నిస్పృహలు రావాలని గవర్నర్ కోరుకొంటున్నారన్నారు. వ్యక్తులు తమను తాము ఎక్కువగా.. లేని అధికారాలు ఉన్నట్టుగా ఊహించుకోవడం వల్ల వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయన్నారు. బ్రిటిషర్లు పెట్టిన దుకాణం గవర్నర్ల వ్యవస్థ అని, ‘కలోనియల్ హ్యాంగోవర్’గా మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థను అభివర్ణించిన విషయాన్ని వివరించారు.
బీజేపీ ఒక మాన్యువల్.. ఒక ప్లే బుక్‌ను తయారు చేసింది. ప్రతి ఎన్నికల్లో వీటిని ప్రయోగిస్తుంది. మతాన్ని రెచ్చగొట్టడం, అభ్యర్థి దవాఖాన పాలవడం, కాలికో.. చేయికో కట్టు కట్టుకోవడం, సానుభూతిని పొందే ప్రయత్నం చేయడం, దుష్ప్రచారం చేయడం.. హింసను ప్రేరేపించడం, రీ పోలింగ్ జరిపించడం. ఇవన్నీ వారి పుస్తకంలో ఉంటాయి. దేశంలో ఎక్కడ చూసినా మీకు ఈ తరహాలోనే బీజేపీ రాజకీయం కనిపిస్తుంది. తెలంగాణలో వారి నిజస్వరూపాన్ని ప్రజలు ముందుంచాం.
బీజేపీ ఫేక్ వార్తలకు ప్రసిద్ధి. దేశంలో ఉన్న ట్విట్టర్ ఖాతాల సంఖ్యకన్నా.. మోదీకి రెండింతల మంది ఫాలోవర్లు ఉంటారు. వాట్సప్ వర్సిటీని పెట్టిందే వాళ్లు. సోషల్ మీడియా తప్ప ప్రజా క్షేత్రంలో ఉండనిది.. లేనిది బీజేపీ ఒక్కటే.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈడీ, ఐటీలతో కావడంలేదనే బీజేపీ నకిలీ స్వాములను రంగంలోకి దించింది. కానీ, వారి కుట్రలు తెలంగాణలో పనిచేయలేదు.
కోల్‌కతాలో బ్రిడ్జి కూలిపోయినపుడు బెంగాల్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అని.. ప్రభుత్వం కూడా కూలిపోతుందని చెప్పారు. ఇప్పుడు గుజరాత్లో బ్రిడ్జి కూలిపోయింది. మరి గుజరాత్లో ప్రభుత్వం కూలిపోవాలా?
గుజరాత్లో పెట్టుబడులు పెట్టకపోతే కేంద్రం పారిశ్రామికవేత్తలను ఇబ్బందులు పెడుతుంది. మోదీ గుజరాత్‌కు ప్రధానమంత్రిలా వ్యవహరిస్తున్నారు. దేశంలోని పెట్టుబడులన్నీ ఆయన రాష్ట్రానికే తరలించుకుపోతున్నారు. తాము తెలంగాణలో పెట్టాలనుకున్న పరిశ్రమలను బీజేపీ, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే గుజరాత్‌కు తరలించామని పలువురు పారిశ్రామికవేత్తలు నాతో చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విదేశీయాత్ర ముగించుకొని మునుగోడులో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు వస్తున్నారు. వాళ్లు కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు. కోవర్ట్ రెడ్డి బ్రదర్స్.
– మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్