Congress | ప్రజల పక్షాన ప్రశ్నించడమే నేరమన్నట్టు.. అక్షరంపై అధికారం కక్ష కడుతున్నది. సామాన్యులపై దాడులు సర్వసామాన్యమైన చోట జర్నలిస్టులపైనా దాడులకు తెగబడుతున్నది… ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయారెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి ప్రగల్భాల నేపథ్యంలో ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లిలో వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చెప్పాలనుకోవడమే వారు చేసిన నేరం! సీఎం ఇలాకాలో రైతులు రుణమాఫీపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకోవడమే వారు చేసిన పాపం! భజంత్రీలుగా ఉండలేక స్వతంత్రంగా సాహసించడాన్ని మరుగుజ్జు మనస్తత్వం తట్టుకోలేకపోయింది. అంతే.. ఏలికకు కోపం వచ్చింది! పది నిమిషాల్లోనే పదుల సంఖ్యలో గూండాలు రంగంలోకి దిగారు. మహిళా పాత్రికేయులను చుట్టుముట్టారు. గురువారం ఉదయం నుంచి సుమారు నాలుగు గంటలపాటు భయానక కాండ కొనసాగింది.
కెమెరాలు, ఫోన్లు గుంజుకున్నారు. వారిని బురదలోకి నెట్టేశారు. తీసుకోబోతే ఒకరికొకరు ఫోన్లు విసిరేసుకుంటూ వెకిలి ఆట ఆడారు. పట్టుకుని వేధించారు. వెళ్లిపోతుంటే వెంటాడారు. పదుల సంఖ్యలో కార్లతో వారిని చేజ్ చేశారు. ఇంత జరుగుతున్నా వారికి రక్షణగా ఎవరూ రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. భీతిల్లిపోయిన మహిళా జర్నలిస్టులిద్దరూ రక్షణ కోరుతూ తామే 7వ పేజీలోవెల్దండ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే.. అక్కడే అదే అరాచకం. చేష్టలుడిగి చూస్తున్న ఖాకీల ముందు కూడా వారి ఆగడాలు ఆగలేదు. ‘ఇయ్యాల ప్రాణాలతో బయటపడ్తరా?’‘ఎవడొస్తడో చూస్తం.. ఇంటిదాక ఎట్లబోతవో చూస్తం’ అంటూ బెదిరింపులు కొనసాగాయి. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మిగితా జర్నలిస్టులపైనా వారి దౌర్జన్యం ఆగలేదు.
ఇది ఏ బీహార్లోనో,
యూపీలోనే జరగలేదు!
ఇది ఏ ఫ్యాక్షన్ సినిమా
విలనీకి తక్కువకాదు!
ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టులను వేధిస్తున్న వీడియోలు బయటకురావడంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. నిజాంకు వ్యతిరేకంగా కలం ఝుళిపించిన తొలితరం పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ రజాకార్ల చేతుల్లో హత్యకావించబడిన రోజునే.. ఇద్దరు మహిళా జర్నలిస్టులపై అధికార పార్టీ అనుయాయుల గూండాగిరీ నాటికీ నేటికీ మారని దుస్థితికి అద్దంపట్టింది. అనుముల గడీలోని ఆగడాల తీవ్రత అందరికీ తెలిసివచ్చింది. గతంలో జర్నలిస్టు శంకర్‌పై దాడి ఘటనతోనే ఆకురౌడీల అరాచకం వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఈ సారి మహిళా జర్నలిస్టులనూ టార్గెట్ చేయడం విషాదం.
ఇదీ తెలంగాణలో
కొడగంటిన పౌరస్వేచ్ఛ!
ఇదీ రాష్ట్రంలో
కొరవడిన మహిళా రక్షణ
కలానికి, గళానికి శృంఖలాలు
తొడిగిన విశృంఖలత
ఈ ఆకృత్యాలపై మహిళా
కమిషన్ స్పందిస్తదా?
సీఎం సొంతూర్లో దౌర్జన్యంపై
నోటీసులు ఇవ్వగలదా?
చర్యలు తీసుకుని
స్వతంత్రతను
కాపాడుకోగలదా?