కరీంనగర్ : జిల్లాలోని మానకొండూర్ మండల పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్తున్న మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంపై పట్ల రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్‌చైర్మన్ వినోద్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. నిత్యం ప్రజలమధ్యన ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న బాలకిషన్ తెలంగాణ ఉద్యమంలో లక్షల మందిని కదిలించిన గొప్ప కళాకారుడని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరూ అడగక ముందే రసమయి చొరవతో తాను గన్నేరువరం మండలాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులపై దాడులు సరికాదని అన్నారు. గుండ్లపల్లి నుంచి వెంకట్రావుపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక వేశామని, సంబంధిత ఫైలు ప్రభుత్వం వద్ద ఉందని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు రాకుండా చేసిందని ఆరోపించారు. – కేంద్రంలో ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ పెట్టి నిధులు రాకుండా చేసిందని మండిపడ్డారు. ఈ విషయంలో ఎంపీ బండి సంజయ్ ఒక్కసారైనా మాట్లాడ లేదని విమర్శించారు. కరీంనగర్లో ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నారో ఆయనకు తెలియదని, ప్రధాని వచ్చినపుడు ఒక్కమాటన్నా మాట్లాడ లేదని ఆరోపించారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలను ఎదుర్కొన్నామని, ఒక్కదాడి అయినా చేశామా అని ప్రశ్నించారు.