హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కొనియాడారు. బీఆర్ఎస్ స్థాపించిన 2001 నుంచి వారు వెన్నెముకగా నిలబడ్డారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జూమ్ ద్వారా నిర్వహించిన యూకే కార్యవర్గ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందు నిలిచి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నదని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేండ్ల తర్వాత వచ్చేది మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని, అప్పటి వరకు ఎన్నారైలు ప్రజాసమస్యలపై నిత్యం గళమెత్తాలని సూచించారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు తప్పా ఒరిగిందేమీలేదని కూర్మాచలం అనిల్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని ఎన్నారైలను కోరారు. నవీన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ ఇచ్చే ప్రతిపిలుపునకు స్పందించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు హరిగౌడ్, సతీశ్‌రెడ్డి గొట్టిముక్కుల, సత్యమూర్తి చిలుముల, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల తదితరులు పాల్గొన్నారు.