కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 27: దక్షిణాది రాష్ర్టాల్లో పార్లమెంట్ స్థానాల పునర్విభజనలో భాగంగా ఎంపీ సీట్లు తగ్గిస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. గురువారం కరీంనగర్‌లోని వాణీనికేతన్ స్కూల్లో ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభా లెక్కల ప్రకారం దక్షిణ భారత దేశంలో పార్లమెంట్ సీట్లు తగ్గిస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఉత్తరాదికంటే దక్షిణ భారతంలో సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన ప్రతిపాదనలో వాస్తవం ఉన్నదని అన్నారు. స్టాలిన్‌తోపాటు చంద్రబాబు మరింత ముందుకెళ్లి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పౌరులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయి తే సీట్లు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పిన విషయంలోనూ వాస్తవం ఉన్నదని అన్నారు.
1971లో డీలిమిటేషన్ ప్రకటించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దక్షిణా దిలో జనాభా తగ్గుతుందన్న విషయాన్ని గమనించి రాజ్యాంగ సవరణ చేశారని గుర్తుచేశారు. 2001లో వాజ్పాయ్ ప్రభు త్వం సైతం రాజ్యాంగ సవరణను మరో 25 ఏండ్ల వరకు పొడిగించినట్టు తెలిపారు. 2026తో ఈ గడువు ముగుస్తుందని, తిరిగి రాజ్యాంగ సవరణ చేసే ఉద్దేశంతోనే అమిత్‌షా ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఉన్నారు.