హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) కేటాయించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. వేగంగా అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా దేశానికి తోడ్పాటును అందిస్తున్న తెలంగాణలో ఐఐఎం లేకపోవడం లోటుగా ఉన్నదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి ఐఐఎం కోసం కేంద్రానికి విన్నవిస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. గతంలో స్వయంగా తానే పార్లమెంట్లో పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తానని, అయినప్పటికీ తమ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో 22వ ఐఐఎంను అస్సాంలోని గువాహటికి కేటాయిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టడాన్ని స్వాగతిస్తూ.. తెలంగాణకు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు.