హనుమకొండ, మే 19: వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రతి పట్టభద్రుడు రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. హనుమకొండ కాకతీయ కాలనీలోని వినోద్‌కుమార్ నివాసంలో వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
సమావేశానికి న్యాయవాదులు, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులు, పరిశోధకులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు జిల్లాకు ఉన్నత విద్యావంతుడు, మేధావి రాకేశ్‌రెడ్డికి విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, న్యాయవాదులు, అన్ని సంఘాల మద్దతు అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, ప్రముఖ న్యాయవాదులు ముద్దసాని సహోదర్‌రెడ్డి, వద్దిరాజు గణేశ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, కేయూ విద్యార్థి సంఘాల నాయకులు జెట్టి రాజేందర్, కొమురయ్య, విజయ్, బీఆర్ఎస్ నాయకులు జోరిక రమేశ్, పోలెపల్లి రామ్మూర్తి, శోభన్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.