KCR | నా జీవితంలో అబ్దుల్ కలాం, వాజపేయి, పీవీ నర్సింహారావు ఇలా ఎంతోమందిని చూసిన. కానీ, కేసీఆర్ అన్ని వర్గాలకు మేలు చేయాలనే విజన్ చాలా గొప్పది. ఇది కేసీఆర్‌ను కీర్తించటం కోసం చెప్పటం లేదు. మహారాష్ట్ర పార్టీల్లో ప్రజల ఎజెండాలేదు. ఆ పార్టీలకు మ్యానిఫెస్టోలు లేవు. అధికారంలోకి రావటమే వారి మ్యానిఫెస్టో. అందుకే బీఆర్ఎస్కు మహారాష్ట్రలో ప్రజల ఆదరణ అద్భుతంగా ఉన్నది.
– నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మహారాష్ట్ర సామాజికవేత్త, గాంధేయవాది వినాయక్‌రావ్ పాటిల్
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర రైతు ఐసీయూలో ఉన్నాడని, ఆ రైతును బతికించుకునేందుకు తామంతా కేసీఆర్ అనే డాక్టర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త, మాజీ ఎమ్మెల్యే వినాయక్‌రావ్ పాటిల్ అన్నారు. మహారాష్ట్ర రైతుల కోసం మరణించే వరకూ పోరాడుతానని ప్రకటించారు. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్‌ను అమలు చేయాలని ఆయన ఇటీవల ఆమరణ నిరాహారదీక్షకు చేపడితే అక్కడి ప్రభుత్వం ఆయనతో చర్చలు జరిపి ఉన్నతస్థాయి కమిటీని వేసిన విషయం తెలిసిందే. బీజేపీ విభజన, విద్వేషరాజకీయాలు ఎంతోకాలం సాగవని తేల్చిచెప్పారు. దేశం కేసీఆర్ లాంటి ఆశాకిరణం కోసం ఎదురుచూస్తున్నదని, మహారాష్ట్రలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో పోటీచేసి ప్రభావాన్ని చూపే అవకాశం కేవలం బీఆర్ఎస్కే ఉన్నదని ఘంటాపథంగా చెప్తున్న ఆయన సోమవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలిలా ఉన్నాయి.
మహారాష్ట్రలో పరంపరగా సాగుతున్న రైతు ఆత్మహత్యలపై తీవ్రంగా కలతచెంది దాదాపు రెండున్నర ఏండ్ల నుంచి తెలంగాణలో రైతులకు అమలు చేస్తున్న రైతుబంధు వంటి పథకాలు మహారాష్ట్ర రైతులకు కావాలని కోరాను. గతంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌తో చర్చించా. చేస్తాం.. చూస్తాం అన్నారు. మొన్న నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాక.. ఐదో రోజు ప్రభుత్వం నన్ను చర్చలకు పిలిచింది. అప్పుడు నేను మహారాష్ట్ర సర్కార్‌కు చాలా స్పష్టంగా.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన. రైతుల పరిస్థితులు బాగుచేసే దాకా ‘మిమ్మల్ని…మీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టను అని. అలా వదిలిపెడితే నా పేరు ‘వినాయక్‌రావ్ పాటిల్ కాదు ‘వినాయక్ పాటిల్ కిసాన్ జిహాదీ’గా మారిపోతానని హెచ్చరించిన. ఇది హెచ్చరిక కాదు.. ఆవేదన. జిహాద్ అంటే నా ఉద్దేశంలో చంపటమో…చావటమో కాదు. ప్రజల, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మరణించేదాకా పోరాటం చేయటం. ఆ పోరాటాన్ని నేను చేస్తూనే ఉంటానని చెప్పటమే నా జిహాదీ ప్రకటన ఆంతర్యం. ఇది నా రెండో జిహాదీ అవుతుంది. 2016లో మొదటిసారి కశ్మీర్లో నాలుగు నెలలపాటు శాంతికోసం జిహాదీ ప్రతినబూనిన. అప్పుడూ చెప్పా.. శాంతి కోసం నేను ఏమైనా చేస్తానని. నా గురించి మహారాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు తెలుసు.
పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన. నేను నా పొలం దగ్గరే కూర్చుంటే మహారాష్ట్ర రైతాంగమంతా కదిలింది. దీన్ని గమనించిన సీఎం షిండే చర్చలకు పిలిచారు. వెళ్లా.. కమిటీ వేశారు. ఆ కమిటీలోని ఉన్నతస్థాయి అధికారులను కొన్ని వేలసార్లు కలిసి విన్నవించిన. వారికి తెలుసు. నాకూ తెలుసు. ఇన్ని దశాబ్దాలు రైతులను పట్టించుకోనివారు. ఇప్పుడు పట్టించుకుంటారని ఆశించటం లేదు. కానీ, సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సహా అందరి సమక్షంలోనే చెప్పిన. కమిటీలు కొత్తకాదు. అయితే ఈ కమిటీకి కాలపరిమితి పెట్టాలి. నిర్ణీత గడువులోగా కమిటీ నివేదికపై చర్చించి తక్షణమే (నెలా రెండు నెలల్లో) అమలు చేయాలని చెప్పిన. అలా కాకపోతే జూన్‌లో జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఎవరినీ వెళ్లనీయబోమని’ బరాబర్ చెప్పిన.
ముమ్మాటికీ కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాకేం బంధువు కాదు. మావి పక్క పక్క ఊర్లు కావు. మేమేమీ ఒక్కబడిలో చదువుకోలేదు. నాది లాతూర్. ఆయనది తెలంగాణ. కేసీఆర్ నా కన్నా వయస్సులో చిన్నవాడు. నాకిప్పుడు 72 ఏండ్లు. దాదాపు 40-50 ఏండ్ల నుంచి నేను ప్రజాసేవలో ఉన్నాను. ప్రజల బాధలు.. కన్నీళ్లు ప్రత్యేకించి రైతుల బాధలు నాకు తెలుసు. మహారాష్ట్రలో నాలుగైదు దశాబ్దాలుగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. రైతుల స్థితిమారాలని పోరాటాలు సాగుతున్నాయి. కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాగానే. రైతులెవరూ కోరకుండానే.. ఉద్యమించకుండానే రైతుబంధు పథకం వచ్చింది. దేశమంతా దీన్ని అనుసరించాల్సి వచ్చింది. దశాబ్దాలుగా రైతుపై ఉత్పత్తి భారం తగ్గాలని మేం ఆశిస్తుంటే.. తెలంగాణలో కేసీఆర్ విజయవంతంగా అమలు చేశారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, సాగునీటి సౌకర్యం అందించటం వల్ల రైతుకు ఉత్పత్తిభారం తగ్గింది. అందుకే మా లాంటివాళ్లకు కేసీఆర్ ఆశాదీపంలా కనిపించారు. రైతు మేలు కోసం చేసే కేసీఆర్ నాకే కాదు దేశంలోనే యావత్తు రైతులోకానికి ఇష్టమైన వ్యక్తి అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ పథకాలు అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ఇలా డిమాండ్ చేయటం భయపెట్టటం అంటే అది భయపెట్టటంగానే భావించండి. నాకేం అభ్యంతరం లేదు.
కచ్చితంగా బీఆర్ఎస్ అధిగమిస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్న. మహారాష్ట్రలో కేసీఆర్ నిర్వహించిన రెండుమూడు సభలకే మహారాష్ట్ర ప్రభుత్వానికి చలనం వచ్చింది. ప్రజల్లో ప్రత్యేకించి రైతులు, దళితులు ఇతర అన్ని వర్గాల్లో కేసీఆర్ పట్ల ఆదరణ ఉన్నది. నా జీవితంలో ఎంతోమంది నాయకులను చూసిన. అబ్దుల్ కలాం, వాజపేయి, పీవీ నర్సింహారావు ఇలా ఎంతోమందిని చూసిన. కానీ, కేసీఆర్‌లో అన్ని వర్గాలకు మేలు చేయాలనే విజన్ చాలా గొప్పది, ప్రత్యేకమైనది. ఇది కేసీఆర్‌ను కీర్తించటం కోసం చెప్పటం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆయన రైతుల కోసం పడుతున్న తపన అంత పవిత్రమైనది. ఇవ్వాళ మహారాష్ట్ర రైతు ఐసీయూలో ఉన్నాడు. కేసీఆర్ అనే డాక్టర్ కోసం అందరం ఆశగా ఎదురుచూస్తున్నాం. రైతులు మాత్రమే కాదు దళితులు, అన్ని వర్గాలు కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. నేను ముందే చెప్పిన మహారాష్ట్రలో రాజకీయాలు అత్యంత దిగజారిపోయాయి. మహారాష్ట్ర పార్టీల్లో ప్రజల ఎజెండాలేదు. ఆ పార్టీలకు మ్యానిఫెస్టోలు లేవు. అధికారంలోకి రావటమే వారి మ్యానిఫెస్టో. అందుకే బీఆర్ఎస్కు మహారాష్ట్రలో ప్రజల ఆదరణ అద్భుతంగా ఉన్నది. అందుకే నా లాంటి వాడు కూడా (నేనేం రాజకీయాలు చేసేది లేదు. పోటీచేసేది లేదు) కేసీఆర్ లాంటి నాయకుడి కోసం ఎదురుచూడటం అత్యాశ కాదు.
విభజన, విచ్ఛిన్న రాజకీయాలు చేయటమే బీజేపీ విధానంగా మారింది. విద్వేషపూరిత, అప్రజాస్వామిక రాజకీయాలు ఎంతోకాలం నిలబడవు.
నేను ఇప్పటి వరకు కేసీఆర్ లాంటి నాయకుడిని చూడలేదు. భారతదేశం భౌగోళిక విస్తీర్ణం, నదీనదాలు, మానవ వనరులు, విభిన్న సంస్కృతులు, వాటి వినియోగం ఇట్లా అన్ని రంగాల్లో సంపూర్ణ అవగాహన కేసీఆర్‌కు ఉన్నట్టు మరే నాయకుడికి లేదని ఘంటాపథంగా చెప్పగలను. దేశంలో ఉన్న నీటి వనరులెన్ని? సముద్రంపాలు అవుతున్నవి ఎన్ని? వీటిని ఎట్లా వినియోగింవచ్చు? వినియోగిస్తే దేశం ఎట్లా ఉంటుంది? ఇట్లా అనేక రంగాల్లో దేశం పట్ల కేసీఆర్‌కు అద్భుత విజన్ ఉన్నది.
చాలా దయనీయంగా ఉన్నది. 50 ఏండ్లల్లో ఎన్నడూలేని దుర్భర పరిస్థితిని మహారాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్నారు. రైతులకు వాతావరణం సహకరించటం లేదు. సోయాబీన్, పత్తి ఇలా అన్ని దిగుబడులను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దురవస్థ రైతుకు దాపురించింది. ఇటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలోని యువరైతులు కేవలం గడచిన ఒక్క సంవత్సరంలోనే 1200 మందికి పైగా (మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాల్లో) ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నా లెక్క కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కే. 70-80 ఏండ్ల వృద్ధులు మరణిస్తే ఇంత బాధ ఉండేది కాదు (జీరగొంతుతో). ఈ దేశ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే యువరైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు మహారాష్ట్రలోని ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వాళ పోటీచేయటానికి చాలా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అన్ని పార్టీలు పరస్పరం నిందించుకోవటం మినహా ప్రజలను ప్రత్యేకించి రైతులను పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. రాజకీయపార్టీల నేతలు వ్యక్తిగత సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్ప సామూహిక ప్రయోజనాల కోసం, తమను ఎన్నుకున్న ప్రజల యోగక్షేమాలను పట్టించుకునే పరిస్థితిలో లేరు.
మీరు చెప్పిన పార్టీలకు ఉన్న పరిమితులే.. బీఆర్ఎస్ విస్తరణ..ఆదరణకు మార్గాలు వేస్తున్నది. మహారాష్ట్రలో ఇప్పుడున్న పార్టీలు అన్ని ప్రాంతాల్లో విస్తరించిలేవు. ఒక పార్టీ ఒక ప్రాంతంలో ప్రభావం చూపితే..మరో పార్టీ మరో ప్రాంతానికి పరిమితమైనది. ఇవే పార్టీలు ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకుంటాయి. అన్ని పార్టీలు అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అవకాశం లేదు. మహారాష్ట్ర ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అని కాకుండా మహారాష్ట్ర మొత్తం మార్పును కోరుకుంటున్నది. బీఆర్ఎస్ దేశానికి ఒక మాడల్‌ను సెట్చేసింది. ఈ విషయం సర్వత్రా విస్తరించింది. మార్పును ఆశిస్తున్న మహారాష్ట్రకు బీఆర్ఎస్ రూపంలో సరికొత్త ఆశ రేకెత్తింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసే సత్తా.. అవకాశం బీఆర్ఎస్కే ఉన్నది. మహారాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ తనవైపు తిప్పుకుంటున్నది. కేసీఆర్‌లో ఆ రాజనీతిజ్ఞత ఉన్నది. ఒక్క మహారాష్ట్ర మాత్రమే కాదు భారతదేశమంతా కేసీఆర్‌లో సరికొత్త క్రాంతిని దర్శిస్తున్నది.
గాంధేయవాదిగా, సామాజిక కార్యకర్తగా, మాజీ ఎమ్మెల్యేగా మహారాష్ట్రవ్యాప్తంగా వినాయక్‌రావ్ పాటిల్ చిరపరిచితులు. లాతూర్ భూకంపం వచ్చినప్పుడు 52 గ్రామాల్లో నిరాశ్రయులైనవారికి ఆవాసాలు ఏర్పాటు చేశారు. తన సామాజిక సేవకు 20 ఎకరాల భూమిని ధారపోశారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌కు సమీప బంధువు. ఇప్పటికీ ఆయన పంటపొలంలోనే చిన్నపాటి ఇంట్లో జీవనం సాగిస్తూ నిస్వార్థ సామాజికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. రైతుల కోసం ఢిల్లీలో జరిగిన సమ్మెలో 380 రోజులు దీక్షలో కూర్చున్నారు. శాంతికోసం నాలుగు నెలలపాటు కశ్మీర్లో దీక్ష చేపట్టారు. మహారాష్ట్ర రైతుల కోసం తన సర్వస్వాన్ని ధారపోసి.. వారి సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాటం చేస్తున్నారు.