(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ‘కాల్పుల విరమణ’ ఒప్పందం కుదిరినప్పటికీ జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లోని వందలాది గ్రామాల ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి రావడానికి జంకుతున్నారు. ‘కాల్పుల విరమణ’ జరిగినప్పటికీ పాకిస్థాన్‌ను నమ్మడానికి లేదని, ఏ క్షణమైనా దాడులు జరుగొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ ఏఎఫ్‌పీతో తమ ఆవేదనను పంచుకొన్నారు. ప్రజలు తిరిగి సొంతూళ్లకు రాకపోవడంతో పలు గ్రామాల్లో ఇండ్లు, దుకాణాలు మూతబడి రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. దీంతో సరిహద్దుల్లోని ఉరి, పూంఛ్, రాజౌరీ, అక్నూర్ తదితర ప్రాంతాల్లోని గ్రామాలకు చెందిన వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాల్పుల ఒప్పందం కుదరడంతో స్వస్థలాలకు రావొచ్చని గ్రామస్థులకు అధికారులు సూచించారు. అయితే, కాల్పుల విరమణ ప్రకటన జరిగిన రోజే పాక్ డ్రోన్ దాడులకు తెగబడిందని, ఇలాంటి సమయంలో భార్య, పిల్లలతో ఊళ్లలోకి ఎలా వస్తామని? పాక్‌ను నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని పలువురు తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం అవసరమైన బంకర్లను ఏర్పాటు చేస్తేనే వస్తామని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
‘కాల్పుల విరమణ జరిగిందని నాకు నమ్మకం కుదరట్లేదు. మా ఊరికి వెళ్లాలని కూడా నాకు లేదు. అక్కడికి వెళ్లినప్పటికీ.. ముందులా నేను రోజూ షాప్‌ను తెరవలేను కదా. మొత్తంగా నా జీవనాధారాన్ని కోల్పోయా’ అని కృష్ణలాల్ అనే టైలర్ పేర్కొన్నారు. ‘కాల్పుల విరమణ ఒప్పందం’ జరుగగానే అంతా బాగానే ఉందని భావించి మేమంతా ఇండ్లకు వెళ్లాం. అయితే, వాస్తవ పరిస్థితి అలా లేదు. దీంతో మళ్లీ వెనక్కి వచ్చేశాం. ప్రభుత్వం అవసరమైనన్ని బంకర్లు ఏర్పాటు చేయాలి. లేకపోతే, ఎవరూ స్వస్థలాలకు రాలేరు. పాక్‌ను నమ్మే పరిస్థితి అస్సలు లేదు’ అని నౌషెరాకు చెందిన అక్షయ్ కుమార్ అనే వ్యక్తి పేర్కొన్నారు. ‘పాక్ దాడులతో సర్వస్వం కోల్పోయాం. మా పిల్లల భవిష్యత్తు ఏంటో అర్థమవ్వట్లేదు. ఏదేమైనా.. మునుపటి జీవితం తిరిగి సాధ్యంకాకపోవచ్చు’ అని ఉరికి చెందిన ఓ దుకాణదారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్వోసీ వెంబడి పాక్ రేంజర్లు జరిపిన షెల్లింగ్‌లో ధ్వంసమైన ఇండ్లను పునర్నిర్మించడానికి అవసరమైన సాయాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. వ్యక్తిగత బంకర్లను నిర్మించాలన్న డిమాండ్లు వస్తున్నాయని, ఈ విషయాన్ని కేంద్రంతో చర్చిస్తానని తెలిపారు. ఈ మేరకు బుధవారం బారాముల్లా జిల్లాలో పర్యటించిన ఆయన ఇండ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు.