మధిర/ మధిర రూరల్, జనవరి 16: స్థాని క ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను అతడి నియోజకవర్గంలోని ప్రజలు దహనం చేయడం స్థానికం గా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో దశబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సేవ చేస్తున్న బీఆర్ఎస్కు చెందిన ఓ కుటుంబంపై ఉప ముఖ్యమంత్రి ప్రోద్బలంతో కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా వ్యవహరించడంతో డిప్యూటీ సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటన ఖమ్మం జిల్లా మధిరలో గురువారం చోటుచేసుకుంది.
మధిర మండలం ఆత్కూరుకు చెం దిన ‘అబ్బూరి’ కుటుంబంలోని సంధ్య గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం ఆమె భర్త రామకృష్ణ (మాజీ సర్పంచ్) అనారోగ్యంతో మరణించా డు. అందుకు గుర్తుగా ‘అబ్బూరి సర్కిల్’ అని నామకరణం చేసి, ఓ బోర్డు ఏర్పాటుచేశారు. గ్రామాభివృద్ధికి పాటుపడిన బీఆర్ఎస్ సర్పంచ్‌కు ప్రజల్లో మంచి పేరు రావడాన్ని కాంగ్రెస్ నాయకులు తాళలేకపోయారు. ఈ విషయాన్ని భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన ప్రోద్బలంతో పోలీసు బందోబస్తు మధ్య ‘అబ్బూరి సర్కిల్’ నేమ్ బోర్డులను గురువారం తొలగించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు భట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘భట్టి దౌర్జన్యం నశించాలి.. భట్టి డౌన్‌డౌన్..’ అంటూ నినాదాలు చేశారు. ఇది హేయమైన చర్య అని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు విమర్శించారు. ప్రజాదరణ కలిగిన నేతల పేర్లు తుడిచి పైశాచిక ఆనందం పొందడం భట్టికి సరైంది కాదని హితవుచెప్పారు.