రాజన్న సిరిసిల్ల : సమగ్ర కుటుంబ సర్వేలో (Samagra Kutumba Survey) ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయు లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎన్యూమరేటర్లను ఇండ్లలోకి రాకుండా పలువురు దుర్భాష లాడుతున్నారు. ఐడీ కార్డులు లాక్కొని ఫొటోలు తీసుకుంటున్నారని వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదంటున్నారు.
తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామస్తులు ఇంటింటి కుటుంబ సర్వేను బహిష్కరించారు. ఇటీవల ఈ గ్రామ సరిహద్దులు మార్చుతూ గెజిట్ వచ్చింది. అయితే గ్రామస్తులు దానిని వ్యతిరేకిస్తూ నెల క్రితం ఎంపీడీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా స్పందన రాకపోవడంతో.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు దూరంగా ఉన్నారు. ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి గ్రామస్తులతో మాట్లాడారు. కానీ సరిహద్దును రీసర్వే చేశాకే సర్వేకు సహకరిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు.