ఎల్కతుర్తి, మార్చి 16 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారులో బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ ప్రారంభం కోసం అధికారులు చేస్తున్న సర్వే పనులను ఆదివారం చింతలపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే… ట్రిపుల్ ఐటీ కోసం కొద్ది రోజులుగా అధికారులు ఎల్కతుర్తి శివారు మడిపల్లి రోడ్డులో గల సర్వే నంబర్ 381లోని 83 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్నారు. 100 ఎకరాలు అవసరమని అధికారులు విన్నవించడంతో చుట్టుపక్కలగల ప్రభుత్వ భూమిని అన్వేషిస్తున్నారు. పక్కనే గల చింతలపల్లిలో 385లో 16 ఎకరాలు, 392లో 40 ఎకరాలు, 389లో 30 ఎకరాలకు 50 ఏండ్ల క్రితమే అసైన్డ్ పట్టాలు స్థానిక రైతులకు ఇవ్వగా, వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. 100 ఎస్సీ కుటుంబీకులు ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీకి ఇట్టి సర్వే నంబర్లలో గల ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు ఆదివారం రెవెన్యూ అధికారులు వెళ్లగా, స్థానిక రైతులతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు అడ్డుకున్నారు. సోమవారం తహసీల్దార్‌తో మాట్లాడాలని అధికారులు రైతులకు విన్నవించగా, శాంతించారు.