నమస్తే నెట్వర్క్ : ‘పల్లె పోరు’ ప్రచారంలో కాం గ్రెస్ నేతలకు అడుగడుగునా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. తమ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను ‘రెండేండ్ల కాంగ్రెస్ వైఫల్యాలు’ వెంటాడుతున్నాయి. అమలుకాని సంక్షేమ పథకాలు, హామీల ఎగవేతపై రోజుకో చోట ప్రజలు ప్రశ్నలను సంధిస్తూ సమస్యలను ఏకరువు పెడుతుండటం వారిని కలవరపెడుతున్నది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసన గళం రోజురోజుకూ తారస్థాయికి చేరుతున్నది. సోమవారం చీరలు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం జనగామ జిల్లా జీడికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మహిళలు నిలదీశారు. ఇండ్లు, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును స్థానికులు ప్రశ్నించడంతో అసహనంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది.
కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం, రూ.2500 ఏమయ్యాయని మహబూబాబాద్ జిల్లా ఎర్రచక్రుతండాలో ప్రభుత్వ విప్ రామచంద్రూనాయక్ను ఆడబిడ్డలు అడ్డుకున్నారు. మహిళా సంఘాలకే చీరలా? మాకెందుకు ఇయ్యరు అంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును మరోసారి జనం నిలదీయగా, ‘ఒర్రితే ఏం కాదు.. నేను చెప్పిందే వినాలి’ అంటూ సదరు ఎమ్మెల్యే మరోసారి జనంపై నోరుపారేసుకున్నారు. కాంగ్రెసోళ్లకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారంటూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఓ మహిళ నిలదీయడమే గాక నువేం చెప్పినా కాంగ్రెస్‌కు ఓట్లేయరనడంతో అసహనంతో ఎమ్మెల్యే జారుకున్నారు.
పర్వతగిరి, డిసెంబర్ 8 : పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రోళ్లకల్ నారాయణపురంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును మహిళలు నిలదీశారు. పింఛన్లు రావడం లేదని, ఇండ్ల మంజూరులో పారదర్శకత లోపించిందని, గ్యాస్ కనెక్షన్ల సబ్సిడీలు అందలేదని, రుణమాఫీ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ రెబల్ అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో వర్గపోరు ఉండొద్దని ఎమ్మెల్యే అనూహ్యంగా కొంకపాకలో ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.
విషయం తెలిసి ఆ గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. రెబల్ అభ్యర్థి ఎమ్మెల్యే నాగరాజును కలిసి, ‘మా గ్రామంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు? రెబల్ అభ్యర్థులకు భయపడి వెనకి వెళ్తున్నారా?’ అని నిలదీశాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, గ్రామ నాయకుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరుగగా, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే అసహనంతో వెనుదిరిగారు.
జన్నారం, డిసెంబర్ 8 : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు మరోసారి చుక్కెదురైంది. మొన్న పెంబి మండలకేంద్రంలో ప్రచారానికి వెళ్లినప్పుడు స్థానికులు నిలదీయగా, వారితో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్పెల్లిలో మహిళలు అడ్డుకున్నారు. ‘మాకెందుకు చీరలు ఇయ్యరు. కొందరికి ఇచ్చి.. కొందరికి ఎందుకు ఆపిన్రు.. మేము ఓట్లు వేయలేదా?.. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ ఇచ్చిండు’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. దీనికి ఎమ్మెల్యే ‘ఒర్రితే అయ్యేది ఏం లేదు.. నేను చెప్పేది వింటే వినాలి.. లేకపోతే లేదు’ అంటూ అసహనంతో ఊగిపోయారు.
అనంతరం ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా మహిళా సంఘంలో సభ్యులుగా ఉంటే అంతమందికి ఇచ్చామన్నారు. మిగతా వారికి ఇద్దామనుకుంటే ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పారు. 18 ఏండ్లు దాటిన మహిళలందరికీ చీరలు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చి హడావుడిగా వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆలేరు రూరల్, డిసెంబర్ 8 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్‌గూడెంలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను స్థానిక మహిళ నిలదీసింది. కాంగ్రెస్ నాయకులకు, డబ్బులిచ్చిన వారికే ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇండ్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమెకు ఇల్లు ఎందుకు ఇవ్వలేదని 2వ విడతలో వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే హామీఇచ్చారు. దీంతో విసిగిపోయిన మహిళ ‘చెప్పినకాడికి చాలు తీయి నువ్వు చెప్పినా ఇక్కడ ఓట్లెవరూ వేయరు.
నీ ఇంద్రమ్మ కమిటీనే ఓట్లు వేసి గెలిపించుకోమని అనడంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోగా, ఇంద్రమ్మ కమి టీ సభ్యులు ఆమహిళతో వాగ్వాదానికి దిగారు. గమనించిన ప్రజలు.. కాంగ్రెస్ నాయకుల రౌడీయిజం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.