Kothagudem | దుమ్ముగూడెం, మే 11: తమ గ్రామంలో ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తేనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అచ్యుతాపురం గ్రామస్థులు తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం గ్రామంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. ఇదే మండలంలోని లక్ష్మీనగరం గ్రామం నుంచి అచ్యుతాపురం వరకు జడ్పీ రోడ్డు నిర్మాణం ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్నదని, గ్రామంలో ఉన్న కల్వర్టు కుంగిపోయిందని తెలిపారు.
దీనిపై సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నివించినా ఎవరూ పట్టించుకోలేదని, ఈసారి పట్టించుకోకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు గ్రామస్థులందరూ కలిసి తీర్మానం చేసినట్టు చెప్పారు. లక్ష్మీనగరంలోని రేగుబల్లి ఆశ్రమ పాఠశాల నుంచి వస్తున్న మురుగునీరు నేరుగా చెరువులో కలుస్తుండటం వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయని, ఈ సమస్యను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన వారిలో అచ్యుతాపురం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.