హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీని ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు ఆ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలను తమ వైపునకు ఆకర్షించేందుకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ప్రయాణికుల కోసం కల్పిస్తున్న కార్యక్రమాలను వివరించి, ఆర్టీసీని ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకే విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థకు రూపకల్పన చేసింది.
ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శనివారం జారీచేశారు. మే1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విలేజ్ బస్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని, హైదరాబాద్ సహా అన్ని మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్ ఆఫీసర్‌ను నియమిస్తారని పేర్కొన్నారు. వీరు ప్రతి 15 రోజులకోసారి గ్రామస్థులు, వార్డు ప్రజలతో సమావేశం అవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు, కొత్త సర్వీసులు, సమస్యల గురించి సమాచారాన్ని సేకరించి, పై అధికారులకు నివేదిస్తారు. గ్రామాల్లో పెండ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల సమయంలో అదనపు ట్రిప్పులు నడిపించేందుకు చర్యలు తీసుకొంటారు.